బెడిసికొట్టిన అఫిడవిట్‌...కాంగ్రెస్‌, బిజెపిలు ఫైర్

November 18, 2019


img

టీఎస్‌ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన తుది అఫిడవిట్‌తో ఆర్టీసీ కేసులన్నిటినీ ఒకేసారి ముగింపజేద్దామనుకొంటే బెడిసికొట్టింది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ప్రతిపక్షాలు కలిసి సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని ప్రయత్నిస్తున్నాయని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను పక్కన పెట్టడం ద్వారా భవిష్యత్‌లో మళ్ళీ ఇటువంటి ప్రయత్నం చేయవచ్చని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

ఆర్టీసీ యాజమాన్యం తరపున వేసిన ఆ అఫిడవిట్‌లో ఆర్టీసీ లెక్కలు, బకాయిలు, సమ్మె, ప్రయివేటీకరణ అంశాల గురించి మాత్రమే ప్రస్తావించాలి కానీ ‘ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని’ రాజకీయపరమైన ఆరోపణ చేయడంతో ఆర్టీసీ ఐకాస నేతలకు, కాంగ్రెస్‌, బిజెపిలకు చేజేతులా సునీల్ శర్మ బలమైన ఆయుధం అందించినట్లయింది. 

మొట్టమొదటిగా స్పందించిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సునీల్ శర్మ ఇచ్చిన అఫిడవిట్‌ రాజకీయ అఫిడవిట్‌లాగ ఉంది. సిఎం కేసీఆర్‌ తయారుచేయించి ఇచ్చిన అఫిడవిట్‌పై సంతకం పెట్టి కోర్టుకు సమర్పించారు. ఆర్టీసీ సమస్యల గురించి ఆయనకు ఏమీ తెలియకుండానే హైకోర్టుకు అఫిడవిట్‌లు సమర్పిస్తున్నారు,” అని ఆరోపించారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ, “సునీల్ శర్మ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఆయన ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించాలి లేకుంటే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలి. ఈ అఫిడవిట్‌నే హైకోర్టు సుమోటోగా స్వీకరించి ఆయనను పదవిలో నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “సునీల్ శర్మ ఎవరి ప్రోద్బలంతో అఫిడవిట్‌లో అటువంటి ఆరోపణలు చేశారో చెప్పాలి. మా పార్టీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించి వారికి అండగా నిలబడి పోరాడుతోందే తప్ప తెరాస సర్కార్‌ను అస్థిరపరిచేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. సిఎం కేసీఆరే మా పార్టీ ఎమ్మెల్యేలని తెరాసలోకి ఫిరాయింపజేసుకొని మా పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నించారనే సంగతి ప్రజలందరికీ తెలుసు. 28 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినా ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం గానీ పట్టించుకోలేదు. రాజకీయ ప్రోద్బలంతో అఫిడవిట్‌ దాఖలు చేసిన సునీల్ శర్మను హైకోర్టు పదవిలో నుంచి తొలగించాలని కోరుతున్నాము. ఆయనపై డిఓపిటికి ఫిర్యాదు చేస్తాము,” అని హెచ్చరించారు.


Related Post