టీఎస్‌ఆర్టీసీకి ఈపీఎఫ్ సంస్థ మొట్టికాయలు

November 18, 2019


img

ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలతో ఇంతకాలం టీఎస్‌ఆర్టీసీ నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా సాగిందో తేటతెల్లమవుతోంది. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ కోసమని వారి జీతాలలో కోసుకొన్న సొమ్మును కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకొన్నట్లు ఆ సంస్థ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టమయింది. 

ఆర్టీసీ లెక్కల విషయంలో సునీల్ శర్మ తదితరులకు హైకోర్టులో మొట్టికాయలు పడుతుండగానే మరోపక్క ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ) కూడా ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు పంపించింది. ఆర్టీసీ చెల్లించవలసిన రూ.760 కోట్ల బకాయిలను చెల్లించవలసిందిగా నోటీసు ఆర్టీసీ యాజమాన్యాయానికి నోటీసు పంపించింది. దాంతో ఆర్టీసీ ఆర్ధికసలహాదారు రమేశ్ ఈపిఎఫ్ఓ ప్రాంతీయ కమీషనర్ వద్దకు వెళ్ళి బకాయి సొమ్ము చెల్లింపుకు మరికొంత సమయం గడువుకావాలని అభ్యర్ధించారు. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాలలో ఉందని, ప్రభుత్వ సాయం అందిస్తే తప్ప తీర్చలేని స్థితిలో ఆర్టీసీ ఉందని తెలిపారు. రూ.760 కోట్లు సొమ్ము ఒకేసారి చెల్లించలేమని వాయిదాల పద్దతిలో చెల్లించేందుకు అనుమతించాలని అభ్యర్ధించారు. 

సాధారణంగా ప్రైవేట్ సంస్థలు ఏవైనా ఈవిధంగా పిఎఫ్ సొమ్మును చెల్లించకపోతే దానిని తీవ్రనేరంగా పరిగణించి ఈపిఎఫ్ సంస్థ చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటుంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం రూ.760 కోట్లు బకాయిపడినా, ఆ విషయం ఇప్పుడు బయటపడేవరకు ఆర్టీసీ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఆర్టీసీ కార్మికులు చెల్లించిన సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం వేరే అవసరాలకు వినియోగించుకోవడం చట్ట ప్రకారం చాలా నేరం కనుక సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్‌నే హైకోర్టు సుమోటోగా స్వీకరించి ఆయనపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికులు పీఎఫ్ సొమ్మే కాక క్రెడిట్ సొసైటీకి చెల్లించిన రూ. 530 కోట్లు సొమ్ము కూడా వాడేసుకొంది. ఈవిషయం కూడా సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్‌లోనే పేర్కొన్నారు. దానిపై దాఖలైన వేరే పిటిషన్‌పై స్పందిస్తూ 6 వారాలలోగా ఆ సొమ్మును టీఎస్‌ఆర్టీసీ క్రెడిట్ సొసైటీ ఖాతాలో జామా చేయాలని హైకోర్టు ఆదేశించింది.


Related Post