రామజన్మభూమి తీర్పుపై కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదు?

November 13, 2019


img

దశాబ్ధాలుగా నలుగుతున్న వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదానికి శాస్వితంగా తెర దించుతూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును పార్టీలు సిద్దాంతలకు అతీతంగా దేశంలో దాదాపు అన్ని పార్టీలు స్వాగతిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్‌ మాత్రం మౌనం వహించడాన్ని కాంగ్రెస్‌ నేత విజయశాంతి తప్పు పట్టారు. మజ్లీస్ అధినేతలకు ఆగ్రహం కలుగుతుందనే భయంతోనే సిఎం కేసీఆర్‌ సుప్రీం తీర్పుపై స్పందించలేదని ఆమె విమర్శించారు. యజ్ఞాలు, యాగాలు చేస్తున్నందున తనంత గొప్ప హిందువు మరొకడు ఉండడన్నట్లు వ్యవహరించే కేసీఆర్‌ ఇప్పుడు సెక్యులర్ పేరుతో మౌనం వహించారని విజయశాంతి ఆరోపించారు. సుప్రీం తీర్పును సిఎం కేసీఆర్‌ సమర్ధిస్తున్నారో లేదో ధైర్యంగా చెప్పాలని విజయశాంతి సవాలు విసిరారు. సిఎం కేసీఆర్‌ కుహానా లౌకికవాది అని ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పడతుంటారని విజయశాంతి విమర్శించారు. 

సాధారణంగా హిందువుల మతపరమైన ఇటువంటి అంశాలపై బిజెపి మొదట తన ప్రత్యర్ధులను నిలదీస్తుంటుంది కానీ విచిత్రంగా లౌకికవాద కాంగ్రెస్‌ పార్టీకి చెందిన విజయశాంతి ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై సిఎం కేసీఆర్‌ గతంలోనే ఓసారి స్పందించారు. ఇవన్నీ అప్రధాన్యమైన అంశాలని, అభివృద్ధి సంక్షేమమే ప్రధాన అంశాలుగా భావిస్తానని అన్నారు. ఎన్నికలలో భావోద్వేగాలు రగిల్చి ప్రజలను ఆకట్టుకొనేందుకు ఇటువంటివి పనికివస్తాయని అన్నారు. 


Related Post