చట్టానికి మేమూ అతీతం కాదు: సుప్రీంకోర్టు

November 13, 2019


img

దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. దాని ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా చట్టానికి అతీతం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు సంచలన తీర్పు వెలువరించింది.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడా ధర్మాసనం బుదవారం ఈ సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందన్న డిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. 

డిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, తుది తీర్పు వెలువరిస్తూ, “సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయవ్యవస్థ అయినప్పటికీ స్వతంత్రత పేరుతో జవాబుదారీతనం లేకుండా వ్యవహరించలేదని ధర్మాసనం పేర్కొంది. కనుక గోప్యత, స్వతంత్రతను కాపాడుకొంటూనే పారదర్శకంగా, జవాబుదారీగా వ్యవహరించడం చాలా అవసరమని ధర్మాసనం పేర్కొంది. దీనిపై 2010 జనవరిలో డిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. 

సుప్రీంకోర్టు ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్‌ వి రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ తీర్పును సమర్ధించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజల దృష్టిలో దాని గౌరవం మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. 


Related Post