ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కొత్త ప్రతిపాదన

November 12, 2019


img

ఆర్టీసీ ప్రయివేటీకరణపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కానీ ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దమా కాదా? ఆర్టీసీ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగించవచ్చా లేదా? హైకోర్టు పరిధిలో ఉన్న అంశాలు ఏమిటి... లేనివి ఏమిటి? అనే చర్చ జరుగడం విశేషం. 

ఇరువర్గాల వాదనలు విన్న తరువాత హైకోర్టు ధర్మాసనం ఒక తాజా ప్రతిపాదన చేసింది. ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ముగ్గురు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఒక కమిటినీ వేస్తామని, దీనిపై ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకొని చెప్పవలసిందిగా అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించిది. ఈ కేసును రేపటికి వాయిదావేసింది. ఆర్టీసీ ప్రయివేటీకరణపై ప్రభుత్వం ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు, చర్యలు తీసుకోకుండా విధించిన తాత్కాలిక స్టేను రేపటి వరకు కొనసాగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. 

ఆర్టీసీ కార్మిక సంఘాల పట్ల మొదటి నుంచి సిఎం కేసీఆర్‌ వైఖరిలో ఎటువంటి మార్పులేదు. ఆర్టీసీ కార్మికులకు తండ్రి వంటివాడినని చెప్పుకొన్న సిఎం కేసీఆర్‌ వారు తనను ధిక్కరించి సమ్మె చేస్తున్న కారణంగా ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నా సానుభూతి చూపకపోగా వారి చావులకు ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని వాదించారు.  

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే కార్మికులు...వారిపై ఆధారపడిన వారి కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిసి ఉన్నప్పటికీ ప్రయివేటీకరించడానికి సిఎం కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నారు. తన స్వగ్రామం చింతమడకలో ప్రజలకు అడగకుండానే ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున సుమారు 2,000 కుటుంబాలకు రూ.200 కోట్లు ఆర్ధికసాయం చేయడానికి వెనుకాడబోనని చెప్పిన సిఎం కేసీఆర్‌, ఆర్టీసీ కార్మికులకు వారి సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఆర్టీసీకి ఒక్క పైసా కూడా ఇవ్వదలచుకోలేదని అఫిడవిట్‌ రూపంలో కోర్టుకు తెలియజేస్తూనే ఉన్నారు. కనుక ఆర్టీసీ కార్మికుల పట్ల సిఎం కేసీఆర్‌ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం అవుతోంది. 

కనుక ఆర్టీసీ సమస్యను పరిష్కరించడానికి హైకోర్టు చేసిన తాజా ప్రతిపాదనకు సిఎం కేసీఆర్‌ అంగీకరించకపోవచ్చు. ఒకవేళ సిఎం కేసీఆర్‌ అంగీకరించకపోతే హైకోర్టు కూడా ఈ వివాదాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇచ్చి తప్పుకొన్నా ఆశ్చర్యం లేదు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని వాదిస్తున్న ప్రభుత్వం, ఈ కేసు లేబర్ కోర్టుకు బదిలీ అయితే  అక్కడ తన వాదనలను అవలీలగా నెగ్గించుకోగలదు. అదే జరిగితే ఆ తరువాత ఏమవుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు.


Related Post