డిసెంబరులో 1.35 లక్షల గృహాప్రవేశాలు

November 12, 2019


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళలో 1.35 లక్షల ఇళ్ళు డిసెంబర్ నెలలో గృహాప్రవేశాలకు సిద్దం అవుతున్నాయి. వాటిలో హైదరాబాద్‌ జంటనగరాలలో 77,406 ఇళ్ళ నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. అలాగే సిద్ధిపేట జిల్లాలో 5,408, భద్రాద్రి కొత్తగూడెంలో 2,607, మహబూబ్‌నగర్‌లో 2,214 ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన జిల్లాలలో కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణపనులు దాదాపు పూర్తయ్యాయి. కనుక ఎంపికైన లబ్దిదారుల చేత గృహాప్రవేశాలు చేయించేందుకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2,83,401 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను మంజూరు చేసింది. వాటిలో 1.35 లక్షల ఇళ్ళు గృహాప్రవేశాలకు సిద్దమవుతుండగా మిగిలినవాటి పనులు వివిద దశలలో ఉన్నాయి. ఒక్కో ఇంటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.6.29 లక్షలు చొప్పున ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.6,99,254 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో వీటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,277.81 కోట్లు విడుదల చేసింది. 

ఎంపికైన లబ్దిదారుల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఇళ్ళను అందజేస్తోంది. లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఇళ్ళ కోసం బ్రోకర్లను, రాజకీయ నాయకులను ఆశ్రయించవద్దని, అర్హులైన వారందరికీ ముందో వెనుకో తప్పకుండా ఇళ్ళు లభిస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ళు అంటే చాలా నాసిరకంగా ఉంటాయనే భావన సర్వత్రా నెలకొనుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ప్రైవేట్ సంస్థలు నిర్మిస్తున్న అపార్టుమెంటులకు, కాలనీలకు ఏమాత్రం తీసిపోనివిధంగా అన్ని హంగులు, సకల సౌకర్యాలతో నిర్మిస్తుండటం విశేషం. ఇళ్ళ మద్య సిసి రోడ్లు, వీధి దీపాలు, రోడ్ల కీరువైపులా చెట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరధ ద్వారా ప్రతీ ఇంటికీ స్వచ్చమైన త్రాగునీరు వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్థలం లభ్యత, దాని ఖరీదును బట్టి హైదరాబాద్‌లో 12 అంతస్తులలో నిర్మిస్తే, జిల్లాలలో 3 అంతస్తులలో నిర్మిస్తున్నారు. డిసెంబర్ 7,8, 21,22 (దశమి, ఏకాదశి) మంచి రోజులు కనుక ఆ నాలుగు రోజులలో ఏదో ఒక రోజున సామూహిక గృహా ప్రవేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు భావించవచ్చు.


Related Post