మిషన్ భగీరధ బేష్: కేంద్రమంత్రి షెఖావత్

November 12, 2019


img

తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ సోమవారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలుచేస్తున్న మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పధకాలు  వాటి సత్ఫలితాల గురించి సిఎం కేసీఆర్‌ ఆయనకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాబోయే 30 ఏళ్ళలో పెరిగే జనాభా అవసరాలకు సరిపడేవిధంగా నీటిని అందించడానికి వీలుగా ఈ పధ్కాన్ని రూపొందించి అమలుచేస్తున్నామని సిఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ రెండు పధకాలకు కేంద్రప్రభుత్వం నిధులు అందజేసి తోడ్పడాలని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.   

అనంతరం కేంద్రమంత్రి స్పందిస్తూ, “తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరధ పధకం ఆదర్శంగా దేశమంతటా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ పధకాన్ని అమలుచేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇంటింటికీ మంచినీటి సరఫరాతో పాటు మురుగునీటిని శుద్ది చేసి వ్యవసాయ, గృహావసరాలకు వినియోగించుకొనే విధానాలను ప్రోత్సహించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు అమలవుతున్న తీరును పరిశీలిస్తాను,” అని అన్నారు. 

మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరిగిందని రాష్ట్ర బిజెపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆ రెండు పధకాలను మెచ్చుకొని వాటిని ఆదర్శంగా తీసుకొని దేశమంతటా అమలుచేస్తామని చెప్పడం విశేషం. అంటే మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై ఎవరి వాదన సరైనది? రాష్ట్ర బిజెపి నేతలదా లేక కేంద్రమంత్రిదా?


Related Post