పులిపై స్వారీకి సిద్దమైన కాంగ్రెస్, ఎన్సీపీ

November 11, 2019


img

మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు ముగిసింది. కాంగ్రెస్‌, ఎన్సీపీలు శివసేనకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించడంతో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్దపడగా, ఎన్సీపీ మాత్రం శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీలు పులిపై స్వారీకి సిద్దమయ్యాయి.  

ప్రభుత్వఏర్పాటుకు 145 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్‌ (44), ఎన్సీపీ (54), శివసేన (56) మూడు పార్టీలు చేతులు కలపడంతో వాటి బలం 154కు చేరుకొంది. కనుక ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని గవర్నర్‌కు తెలియజేసేందుకు శివసేన ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌ చేరుకొన్నారు. మొట్టమొదటిసారిగా శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభించింది. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నట్లు సమాచారం. 

ఇదివరకు సంకీర్ణ ప్రభుత్వం నడిపించిన బిజెపి, శివసేనలు ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలలో కలిసే పోటీ చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండూ పట్టువిడవకపోవడంతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దాంతో శివసేనను ప్రభుత్వం ఏర్పాటు  చేయవలసిందిగా గవర్నర్‌ కోరారు. కాంగ్రెస్‌, ఎన్సీపీలు మద్దతు లేఖలను గవర్నర్‌ కార్యాలయానికి పంపాయి. కనుక ఒకటి రెండు రోజులలోనే మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.     

తమది లౌకికవాదపార్టీ అని గర్వంగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ, హిందూఅతివాద పార్టీ అయిన శివసేనకు మద్దతు ప్రకటించడం ఆశ్చర్యకరమే. భిన్న దృవాల వంటి వీటి స్నేహం ఎంతకాలం నిలుస్తుందో చూడాలి.


Related Post