ఆర్టీసీ బకాయిలు..ప్రభుత్వం కొత్త లెక్కలు!

November 11, 2019


img

ఆర్టీసీ సమ్మె, బకాయిలు, జీతాల చెల్లింపు తదితర అంశాలపై సోమవారం హైకోర్టు విచారణ జరుపనుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మె ముగింపుకు ప్రయత్నించాలని, సెప్టెంబర్ నెల జీతాల బకాయి కోసం రూ.47 కోట్లు విడుదల చేయాలని హైకోర్టు చేసిన సూచనలు, విజ్ఞప్తులపై రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తనదైన శైలిలో హైకోర్టుకు సమాధానం చెప్పడానికి సిద్దం అయ్యింది. 

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఒక్క పైసా కూడా చెల్లించదలచుకోలేదని చెప్పబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వాదనను సమర్ధించుకొనేందుకు ఆర్టీసీకి ఉన్న అప్పులు, బకాయిల జాబితాను అఫిడవిట్‌ ద్వారా హైకోర్టుకు సమర్పించనుంది. ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిని పట్టించుకోకుండా సమ్మెకు దిగి ఇంకా నష్టం కలిగిస్తున్న ఆర్టీసీ కార్మికులపై పారిశ్రామిక వివాదాల చట్టం క్రింద చర్యలు తీసుకొనేందుకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం సమర్పించనున్న తాజా అఫిడవిట్‌లో... 

1. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ బకాయిలు:                      788.30 కోట్లు 

2. ఆర్టీసీ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీకి:                          500.95 కోట్లు 

3. ఆర్టీసీ కార్మికుల లీవ్ ఎన్-క్యాష్ మెంట్ బకాయిలు:    180.00 కోట్లు 

4. రిటైర్ ఉద్యోగులకు చెల్లించవలసినది:                       52.00 కోట్లు      

5. 2017-19 మోటార్ వెహికల్ టాక్స్ బకాయిలు:         452.36 కోట్లు

6. బస్సుల స్పేర్ పార్టుల చెల్లింపులకు :                       74.60 కోట్లు 

7. బస్సుల మరమత్తుల బకాయిలు:                            0.60 కోట్లు

8. ఆయిల్ బిల్లుల చెల్లింపులు:                                 34.45 కోట్లు

9. ఆర్టీసీ కార్యాలయాల నిర్వహణ ఖర్చులు:                  36.40 కోట్లు

10. అద్దె బస్సులకు చెల్లించాల్సినది:                             25.00 కోట్లు

11. అక్టోబరు, నవంబర్ నెలలలో రుణాల చెల్లింపులకు:        65.00 కోట్లు 

 మొత్తం రూ.2,209.66 కోట్లు బకాయిలు పేరుకుపోయున్నాయని  ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోయినందున ఇంతకాలం ప్రభుత్వం ఆర్టీసీని కాపాడేందుకు ఎప్పటికప్పుడు ఉదారంగా ఆర్ధికసాయం అందిస్తోందని, ఇకపై ఏమాత్రం చేయలేమని తేల్చి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ప్రభుత్వం హైకోర్టు సమర్పించనున్న ఈ అఫిడవిట్‌లో గణాంకాలు ఆర్టీసీ కార్మిక సంఘాల వాదనలు నిజమని నిరూపిస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు, సొసైటీకి చెల్లించవలసిన సొమ్మును చెల్లించడంలేదని, దానిని వేరే అవసరాలకు వినియోగిస్తోందని, బస్సుల విడిభాగాల కొనుగోలు, బస్సుల మరమత్తులలో అలసత్వం ప్రదర్శిస్తోందనే ఆర్టీసీ కార్మిక సంఘాల వాదనలు నిజమని ప్రభుత్వమే అఫిడవిట్‌ ద్వారా హైకోర్టుకు తెలియజేసినట్లయింది. 

ఇంతకుముందు హైకోర్టు ఎన్నిసార్లు గుచ్చిగుచ్చి అడిగినా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఈ లెక్కలను బయటపెట్టలేదు. ఇప్పుడు హైకోర్టుకు సమర్పించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మళ్ళీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చు. అయితే ఆర్టీసీ సమ్మె ముగింపుకు ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు కనుక ఈరోజైనా హైకోర్టు నిర్ధిష్టమైన నిర్ణయం ప్రకటిస్తుందో లేదో చూడాలి. 


Related Post