కేసీఆర్‌ వల్లే అధికారులకు చీవాట్లు: చాడ

November 09, 2019


img

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి శుక్రవారం మగ్దూం భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ అహంకారం, మొండిపట్టుదల కారణంగానే ఉన్నతాధికారులు హైకోర్టు బోనులో నిలబడి చివాట్లు తినవలసి వస్తోంది. హైకోర్టు, ప్రజల ముందు తల దించుకోవలసివస్తోంది. సిఎం కేసీఆర్‌కు కోర్టులు, చట్టాలు అంటే గౌరవం లేకపోవచ్చు కానీ అధికారులు కూడా వాటిని పట్టించుకోకుండా ఆయన చెప్పినట్లే చేస్తుండటం వలననే వారికి నేడు ఈ దుస్థితి దాపురించింది. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు ప్రారంభించాలని హైకోర్టు చెపుతుంటే, సిఎం కేసీఆర్‌ ఆర్టీసీని ప్రయివేటీకరణ చేయడానికి ప్రయత్నించడంతో హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు సిఎం కేసీఆర్‌ తన నిర్ణయాన్ని ఏవిధంగా సమర్దించుకోగలరు? హైకోర్టు ఇన్ని మొట్టికాయలు వేస్తున్నా సిఎం కేసీఆర్‌ ఇంకా మొండిగా వ్యవహరిస్తుండటం వలన ఆర్టీసీ కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం ఇంత అల్లకల్లోలం కావడానికి సిఎం కేసీఆర్‌ మొండి వైఖరే కారణం. కనుక ఇకనైనా సిఎం కేసీఆర్‌ మొండిపట్టుదల మానుకొని ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలకాలి,” అని అన్నారు. 

ప్రభుత్వ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం తగినంత స్వేచ్చ, నిర్ణయాలు తీసుకొనే అధికారాలు ఇచ్చినట్లయితే వారు తప్పకుండా ఈ ఆర్టీసీ సమస్యను పరిష్కరించి ఉండేవారు. కానీ సిఎం కేసీఆరే అన్ని నిర్ణయాలు తీసుకొంటూ వాటిని అమలుచేయాలని ఆదేశిస్తున్నందున ఐఏఎస్ అధికారులు సిఎం ఆదేశాలను పాటించక తప్పదు. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలే ఇంతవరకు ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ నిర్ణయాల గురించి బహిరంగంగా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నప్పుడు సిఎం కేసీఆర్‌ కనుసన్నలలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఏవిధంగా వ్యతిరేకించగలరు? ఒకవేళ వ్యతిరేకిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక వారు అటు సిఎం కేసీఆర్‌కు నచ్చజెప్పలేక, ఇటు కోర్టుకు జవాబులు చెప్పుకోలేక మద్యలో నలిగిపోతున్నారని చెప్పవచ్చు. కనుక ఈ విషయంలో వారిని తప్పు పట్టలేము.


Related Post