తెలంగాణ ప్రభుత్వ వైఖరి మార్పులేదు

November 09, 2019


img

ఆర్టీసీ సమ్మె, బకాయిల చెల్లింపులు, ఆర్టీసీ ప్రయివేటీకరణ తదితర అంశాలపై హైకోర్టు ఎన్ని చివాట్లు పెడుతున్నప్పటికీ, ఎంతగా నచ్చజెపుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వైఖరిలో ఎటువంటి మార్పు కలగకపోవడం చాలా ఆశ్చర్యకరమే. ఆర్టీసీ కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరపాలని, రూ.47 కోట్లు బకాయిలు విడుదల చేయాలని, ఆర్టీసీ ప్రయివేటీకరణపై పునరాలోచించుకోవాలంటూ హైకోర్టు చేసిన అనేక సూచనలపై సిఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో రవాణామంత్రి అజయ్ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యి చర్చించారు. 

ఆర్టీసీని ఆర్టీసీ ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వానికి గల హక్కును హైకోర్టు ప్రశ్నించజాలదని, సోమవారం జరుగబోయే తదుపరి విచారణలో ఇతర అంశాలపై కూడా ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా బలంగా వాదనలు వినిపించాలని సిఎం కేసీఆర్‌ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. అంటే ఆర్టీసీ సమ్మె విషయంలో సిఎం కేసీఆర్‌ ఏమాత్రం వెనక్కు తగ్గే ఆలోచనలో లేరని స్పష్టం అవుతోంది. 

ఒకవేళ సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ చూపకపోతే హైకోర్టు నిర్ణయం తీసుకోవలసి వస్తుందని ముందే సూచించింది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఏ నిర్ణయం తీసుకొన్నా దానిని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని సిఎం కేసీఆర్‌ కూడా ముందే చెప్పారు. కనుక సోమవారం హైకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్‌ వేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

అదేకనుక జరిగితే, సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘ పోరాటం చేయగలరా? చేయలేకపోతే వారి పరిస్థితి ఏమిటి? ఒకవేళ హైకోర్టు ఆర్టీసీ ప్రయివేటీకరణపై స్టేను పొడిగిస్తే అప్పుడు ప్రభుత్వం దానిపై కూడా సుప్రీంకోర్టుకు వెళుతుందా? వెళితే ఆర్టీసీని పూర్తిస్థాయిలో నడిపించలేక, ప్రైవేట్ బస్సులను తిప్పలేకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి...? ఇలా అనేక ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. 


Related Post