మరికాసేపట్లో అయోధ్యపై అంతిమ తీర్పు

November 09, 2019


img

దశాబ్ధాలుగా కొనసాగుతున్న అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు శనివారం ఉదయం 10.30 గంటలకు తుది తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు ఏవిధంగా ఉన్నప్పటికీ దానికి కట్టుబడి ఉండాలని హిందూ,ముస్లిం మతపెద్దలు నిర్ణయించడం చాలా అభినందనీయం. ఈ తీర్పును ఒక మతానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో చూడరాదని ఇరువర్గాల పెద్దలు ప్రజలకు పిలుపునిచ్చారు. తీర్పుపై ఎవరూ విజయోత్సవాలు, నిరసనలు నిర్వహించవద్దని కూడా పిలుపునిచ్చారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తచర్యలుగా కేంద్రప్రభుత్వం అయోధ్యతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో భద్రతను పెంచింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, జమ్ముకశ్మీర్‌తో సహా పలు రాష్ట్రాలలో విద్యాసంస్థలకు ఈరోజు శలవు ప్రకటించింది. సుప్రీం తీర్పు వెలువడనున్నందున అయోధ్యలో భారీగా భద్రతాదళాలను మోహరించింది. తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్‌తో సహా జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌లకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. 

అయోధ్య-బాబ్రీ మసీదుపై 1853 సంవత్సరం నుంచే దేశంలో హిందూ, ముస్లింల మద్య  వివాదాలు, మతఘర్షణలు, న్యాయ విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత జరిగిన అనేకపరిణామాల గురించి దేశప్రజలందరికీ తెలుసు. ఈ వివాదమంతా మందిరం, మసీదు ఉన్న 2.77 ఎకరాల భూమి చుట్టూనే కొనసాగుతోంది. కనుక ఈ వివాదాన్ని ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు సిద్దపడ్డాయి. ముందుగా కోర్టు బయట ఇరువర్గాల మత పెద్దల మద్య మధ్యవర్తుల సమక్షంలో సుదీర్గంగా చర్చలు జరిగాయి. 

అనంతరం వాటి ఆధారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్‌ అధ్యక్షతన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 40 రోజుల పాటు రోజువారీ విచారణ చేపట్టి ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న తరువాత నేడు తుది తీర్పును వెలువరించనుంది. 

ఈ తీర్పుకు హిందూ, ముస్లింలు కట్టుబడితే అందరికీ గౌరవంగా ఉంటుంది. ప్రపంచదేశాల దృష్టిలో  దేశగౌరవం పెరుగుతుంది. దాదాపు 138 సం.లుగా నలుగుతున్న సమస్య శాస్వితంగా పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారమైతే అటు హిందువులు, ఇటు ముస్లింలు అక్కడ నిర్భయంగా పూజలు, ప్రార్ధనలు చేసుకొనే అవకాశం కూడా ఏర్పడుతుంది. కనుక ఈ తీర్పుకు దేశప్రజలందరూ కట్టుబడి ఉండటమే అందరికీ శ్రేయస్కరం. 


Related Post