బిజెపి హెచ్చరికలు లైట్ తీసుకోవచ్చా?

November 08, 2019


img

ఆర్టీసీ సమ్మెకు రాష్ట్ర బిజెపి మద్దతు ఇస్తున్నందున దానికి అధిష్టానం సమ్మతి ఉన్నట్లుగానే భావించవలసి ఉంటుంది. కనుక కేంద్రప్రభుత్వం కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేస్తున్న హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం లైట్ తీసుకొంటే మున్ముందు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు.

ఆర్టీసీ సమ్మెపై  హైకోర్టులో విచారణలు తుది దశకు చేరుకొన్నప్పుడు కేంద్రప్రభుత్వం హటాత్తుగా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావును నియమించడం, ఆయన నిన్న జరిగిన విచారణలో కేంద్రప్రభుత్వం తరపున వాదించడం ఒక తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

హైకోర్టులో జరుగుతున్న పరిణామాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. చర్చలతో సమస్యలను పరిష్కరించుకొని సమ్మెను ముగించమని హైకోర్టు పదేపదే సూచిస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్చలకు విముఖత చూపుతూ, ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టగానే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడం మరో తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకొంటామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేసిన హెచ్చరికలకు అనుగుణంగానే ఇది జరిగినట్లు భావించవచ్చు. 

ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 15మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు అయినా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. పైగా దానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని నిందిస్తోంది. ఇంటర్ విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నప్పుడే దానిపై కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇప్పుడు ఇంతమంది ఆర్టీసీ కార్మికులు వరుసగా చనిపోతుంటే మౌనంగా చూస్తూ ఉంటుందనుకోలేము.

అలాగే అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం కేసుపై కూడా రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఉంటారనుకోలేము. గతంలో అటవీశాఖ అధికారిణి వినీతపై తెరాస నేత దాడి చేసినప్పుడు కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు విధులలో ఉన్న అధికారిణిని ఆమె కార్యాలయంలోనే సజీవదహనం చేస్తే కేంద్రప్రభుత్వం చూస్తూ ఊరుకొంటుందనుకోలేము.

బిజెపి ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పోలీసులు, జిల్లా కలెక్టరుపై లోక్సభ స్పీకరుకు ఫిర్యాదు చేయడం దానిపై ఆయన వెంటనే స్పందించడం తెలిసిందే. తమ ఎంపీపై పోలీసులు దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగనిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. 

ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇటువంటి సమయంలో రేపు లక్షలాదిమందితో మిలియన్ మార్చ్ తరహాలో ‘ఛలో ట్యాంక్ బండ్’ పేరుతో ఆర్టీసీ కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నాయి. ఆ సందర్భంగా హింస చెలరేగితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్న తలెత్తుతుంది. 

ఇక తెరాస, మజ్లీస్ పార్టీలను తీవ్రంగా వ్యతిరేకించే బిజెపి ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులవడం, ఆ తరువాత తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా చేసిన తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులవడం... ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న ఈ అవాంఛనీయ పరిస్థితులు అన్ని ప్రమాద ఘంటికలు మొగిస్తూనే ఉన్నాయి. కనుక తెరాస సర్కార్‌ తక్షణం ఈ పరిస్థితులను చక్కదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొనే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.


Related Post