ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌...కేసీఆర్‌కు హైకోర్టు డెడ్‌లైన్స్!

November 07, 2019


img

గత 33 రోజులుగా నిరవదిక సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సిఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌లు ప్రకటిస్తుంటే, ఆయనకు హైకోర్టు డెడ్‌లైన్‌ విధిస్తుండటం విశేషం. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. ఆలోపుగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల జరపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

అయితే గడువులోగా చేరని ఆర్టీసీ కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, ఇక ఎట్టి పరిస్థితులలో వారితో చర్చలు జరుపబోమని, ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరిస్తామని, ఇది మంత్రివర్గ సమిష్టి నిర్ణయమని దీనిలో ఎటువంటి మార్పు ఉండబోదని సిఎం కేసీఆర్‌ గట్టిగా చెప్పారు. అందుకు తగ్గట్లుగానే 5,100 రూట్లలో ప్రైవేట్ బస్సులకు అనుమతులు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

కానీ ఈనెల 11లోపుగా ఆర్టీసీ కార్మికులతో చర్చలు మొదలుపెట్టాలని హైకోర్టు గడువు విధించడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే ఇదివరకు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు మొక్కుబడిగా చర్చలు జరిపి ‘మమ’ అనిపించేసినట్లే ఈసారి కూడా చేస్తుందా? లేక టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్దత లేదనే సాకుతో వారితో చర్చించబోమని చెప్పుతుందా? చూడాలి. 

ఇక ఆర్టీసీలో 5,100 రూట్లను ప్రైవేటీకరించడంపై తాజాగా ఒక పిటిషన్‌ దాఖలైంది. దానిపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టబోతోంది. ఈ కేసు ఏవిధంగా మలుపు తిరుగుతుందో చూడాలి.


Related Post