ఆర్టీసీ కేసు...మళ్ళీ మొట్టికాయలే

November 07, 2019


img

ఈరోజు హైకోర్టులో జరుగుతున్న విచారణలో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి, ఆర్ధికశాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ హాజరయ్యి కోర్టు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెపుతున్నారు. వారు వేర్వేరుగా సమర్పించిన అఫిడవిట్లపై మళ్ళీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ మూడింట్లో లెక్కలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయని, న్యాయస్థానాన్ని అయోమయపరిచేందుకు ఉద్దేశ్యపూర్వకంగా గజిబిజిగా లెక్కలు, పదాలతో నివేదికలు తయారుచేసి కోర్టుకు సమర్పించారని ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుకే తప్పుడు లెక్కలు చూపి మభ్యపెట్టాలని ప్రయత్నించే ఐఏస్‌ అధికారులను నా సర్వీసులో ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ రవాణామంత్రికి తప్పుడు లెక్కలు సమర్పించారని, తద్వారా ప్రభుత్వాన్ని, అసెంబ్లీని, ప్రజలను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తిని ప్రభుత్వం ఇంకా పదవిలో ఎందుకు కొనసాగనిస్తోందని ప్రశ్నించారు. ఒకవేళ ఆనాడు సునీల్ శర్మ అసెంబ్లీకి ఇచ్చిన గణాంకాలు నిజమైతే ఇప్పుడు హైకోర్టుకు సమర్పించిన గణాంకాలలో ఎందుకు తేడా వచ్చిందని, అంటే హైకోర్టుకు తప్పుడు లెక్కలు చూపినట్లే కదా? దీనిని కోర్టు ధిక్కరణ క్రింద ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ బాకీ లేనప్పుడు మరి ఏటా డబ్బు ఇమ్మని జీహెచ్‌ఎంసీని ఆర్టీసీ ఎందుకు అడుగుతోంది? ఎందుకు ఇచ్చింది? అని ప్రశ్నించారు. 

ఒకానొక సమయంలో హైకోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడిన ఆర్ధికశాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమయం లేకపోవడం వలన అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా నివేదికలు సమర్పించామని, కనుక తమను క్షమించాలని కోరారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 


Related Post