లక్ష్మీపార్వతికి కీలకపదవి

November 06, 2019


img

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రెండవ భార్య, వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతికి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలకపదవిని కట్టబెట్టారు. ఆమెను తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్ బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

జనవరి 1996లో ఎన్టీఆర్ ఆకస్మికంగా మృతి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకు నిత్యం అవమానాలు, విమర్శలే ఎదురయ్యాయి తప్ప ఇటువంటి గౌరవం లభించలేదనే చెప్పవచ్చు. ఇప్పుడు ఆమెకు ఈ పదవి లభించడానికి బలమైన కారణమే కనిపిస్తోంది. 

చంద్రబాబునాయుడుని జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగా అసహ్యించుకొంటారో ఆమె కూడా అంతకంటే ఎక్కువగానే అసహ్యించుకొంటారు. చంద్రబాబునాయుడుపై వ్యతిరేకతతోనే ఆమె జగన్‌మోహన్‌రెడ్డికి బాసటగా నిలిచారు. అందుకు ప్రతిఫలంగా నేడు ఆమెకు ఈ అనూహ్యమైన పదవి, గౌరవ లభించాయని భావించవచ్చు. 

అయితే ఆమె కంటే ఎక్కువగా చంద్రబాబునాయుడుతో యుద్ధాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు జగన్ తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని అందరూ భావిస్తే ఆమెను పక్కబెట్టడంతో ఆమెతో సహా ఆమె శత్రువులు కూడా ఆశ్చర్యపోక తప్పలేదు. ఆ తరువాత ఆమెకు ఏపీఐఐసి చైర్ పర్సన్ పదవి కట్టబెట్టారు. మంత్రి పదవికి అర్హురాలైన రోజా ఆ పదవి ఆశించినప్పటికీ ఆమెకు దక్కలేదు కానీ అడగకుండానే లక్ష్మీపార్వతికి గౌరవనీయమైన పదవిని కట్టబెట్టడం విశేషం. 


Related Post