టీఎస్‌ఆర్టీసీకి ప్రభుత్వం బాకీ లేదు...విరాళాలు ఇచ్చింది

November 06, 2019


img

టిఎస్ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలపై మళ్ళీ ఎటువంటి దాపరికాలు లేకుండా సమగ్ర నివేదికలు సమర్పించాలనే హైకోర్టు ఆదేశాల మేరకు బుదవారం రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు,  జీహెచ్‌ఎంసీ తరపున కమీషనర్ లోకేశ్ కుమార్, ఆర్టీసీ తరపున ఆ సంస్థ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ వేర్వేరుగా హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. 

ఆర్ధిక శాఖ అఫిడవిట్‌లో... ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,006 కోట్లు చెల్లించవలసి ఉండగా వేర్వేరు పద్దుల క్రింద మొత్తం రూ.3,903 కోట్లు చెల్లించిందని, కనుక ఆర్టీసీయే ప్రభుత్వానికి రూ.540 కోట్లు బాకీ ఉందని పేర్కొన్నారు. రుణం పద్దు క్రింద ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిన సొమ్ము ‘విరాళమని’ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

జీహెచ్‌ఎంసీ అఫిడవిట్‌లో... జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ఆర్టీసీకి నిధులు ఇవ్వవలసిన అవసరమే లేదు కానీ జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితులు బాగున్నప్పుడు వీలైనంతవరకు ఆర్టీసీకి సాయం చేశామని, అంత మాత్రన్న వాటిని ఆర్టీసీకి చెల్లిస్తున్న బాకీలుగా భావించరాదని పేర్కొన్నారు. 2018-19లో ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఒక్క పైసా కూడా చెల్లించవలసిన అవసరం లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

ఆర్టీసీ యాజమాన్యం అఫిడవిట్‌లో... ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి మరిన్ని నిధులు రాబట్టాలనే ఉద్దేశ్యంతోనే సెప్టెంబర్ 11న అసెంబ్లీలో రవాణామంత్రికి ఆర్ధిక అంశాలు వివరించామే తప్ప ఆర్టీసీకి ప్రభుత్వం బాకీ ఉందనే ఉద్దేశ్యంతో కాదని పేర్కొన్నారు. నిజానికి ప్రభుత్వం రూ.867 కోట్లు ఆర్టీసీకి అదనంగా ఇచ్చిందని పేర్కొన్నారు. రుణాల పద్దు క్రింద ఆర్టీసీకి చెల్లించిన నిధులను లేదా వాటిపై వడ్డీని చెల్లించాలని  ప్రభుత్వం ఏనాడూ కోరలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు లెక్కలతో అఫిడవిట్లు సమర్పిస్తోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన  హైకోర్టు, రేపు జరుగబోయే విచారణకు రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు,  జీహెచ్‌ఎంసీ తరపున కమీషనర్ లోకేశ్ కుమార్, ఆర్టీసీ తరపున ఆ సంస్థ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మలను ‘సంతృప్తికరమైన సమాధానాలతో’ హాజరవ్వాలని ఆదేశించింది. కానీ వారు ఈరోజు సమర్పించిన తాజా అఫిడవిట్లలో కూడా మళ్ళీ పాత పాటే పాడటంతో హైకోర్టు రేపు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 


Related Post