మంత్రులు సభకు ఆలస్యంగానే వస్తే బాగుంటుందేమో?

November 02, 2019


img

సాధారణంగా బహిరంగసభలకు మంత్రులు ఎంతో కొంత ఆలస్యంగానే వస్తుంటారు. ఆర్ధికమంత్రి హరీష్‌రావు కూడా ఈరోజు సిద్ధిపేటలోని దుబ్బాకలో మహిళల మెప్మా రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆలస్యంగానే వచ్చారు. గంటో అరగంటో అయితే పరువాలేదు...ఏకంగా 4 గంటలు ఆలస్యంగా వచ్చారు. మధ్యాహ్నం 11.30 గంటలకు సభకు హాజరుకావలసి ఉండగా పని ఒత్తిడి కారణంగా మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకొన్నారు. కానీ ఆయన కోసం మహిళలు చాలా ఓపికగా ఎదురుచూస్తూ కూర్చోన్నారు. తనవలన అంతమంది మహిళలు భోజనాలు మానుకొని ఎదురుచూశారని తెలిసి హరీష్‌రావు చాలా బాధపడ్డారు. “సభకు ఆలస్యంగా వచ్చి మీ అందరికీ చాలా ఇబ్బంది  కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా వలన మీకు కలిగిన ఇబ్బందికి పరిహారం చెల్లించాలనుకొంటున్నాను. మీకు ఎంత పరిహారం చెల్లించాలో మీరే చెప్పండి,” అని హరీష్‌రావు మహిళలను కోరారు. 

దాంతో వారు దుబ్బాకలో తమకు ఒక మహిళా భవనం నిర్మించి ఇవ్వాలని కోరారు. అందుకు మంత్రి హరీష్‌రావు వెంటనే అంగీకరించారు. మహిళా భవనం నిర్మాణం కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే వేదికపై నుంచే ఈఎన్సీ కృష్ణారావుకు ఫోన్‌ చేసి తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఆదేశించడంతో సభకు వచ్చిన మహిళలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మంత్రులు సభకు ఆలస్యంగా వస్తే ఇంత లాభం ఉంటుందంటే వారు ఆలస్యంగా వస్తేనే బాగుంటుందని ప్రజలు కోరుకొంటారు కదా!


Related Post