ఆర్టీసీ కధ క్లైమాక్స్ కు చేరుకొంటోందా?

November 02, 2019


img

29 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె క్లైమాక్స్ కు చేరుకొంటోందా?అంటే జరుగుతున్నా తాజా పరిణామాలను చూస్తుంటే అవుననిపిస్తోంది. 

తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు మళ్ళీ నిన్న చివాట్లు పెట్టడంతో సిఎం కేసీఆర్‌ మళ్ళీ  నిన్న సాయంత్రం రవాణామంత్రి అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యి పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీని మూడు కార్పొరేషన్లు విభజించాలనే ప్రతిపాదనను, ఇతర రాష్ట్రాలలో ఆర్టీసీని ప్రైవేటీకరణకు అనుసరించిన విధివిధానాలపై చర్చ జరిగినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. దానిలో ఆర్టీసీపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయడంతో సమ్మె మరింత ఉదృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించారు. ఆ ప్రయత్నాలలో భాగంగా త్వరలో హైదరాబాద్‌ ట్యాంక్ బండ్‌పై రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మిలియన్ మార్చ్ నిర్వహించాలనే ప్రతిపాదనపై ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ నేతలు హైదరాబాద్‌లో చర్చించుకొంటున్నారు. 

29 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో కార్మికులు వరుసగా మరణిస్తుండటంతో కేంద్రప్రభుత్వం కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టినట్లుంది. ఆర్టీసీ సమ్మె, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నిన్న కరీంనగర్‌లో డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్న బిజెపి ఎంపీ బండి సంజయ్‌పై పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించడంకు సంబందించి పూర్తి వివరాలతో వెంటనే డిల్లీకి రమ్మనమని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కేంద్రహోంమంత్రి అమిత్ షా  ఆదేశించడంతో ఆయన డిల్లీ బయలుదేరారు. 

ఆయన డిల్లీ బయలుదేరి వెళ్ళేముందు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తదితరులు కె.లక్ష్మణ్‌తో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యి తదుపరి కార్యాచరణ గురించి చర్చించినట్లు సమాచారం. కె.లక్ష్మణ్‌ చెప్పిన దానిని బట్టి కేంద్రప్రభుత్వం ఈ వ్యవహారంలో కలుగజేసుకొనే అవకాశం కనిపిస్తోంది.  

కనుక ఆర్టీసీ సమ్మె వ్యవహారం దాదాపు క్లైమాక్స్ కు చేరుకొన్నట్లే కనిపిస్తోంది. దీనిపై ఈరోజు మంత్రివర్గ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలను బట్టి ఆర్టీసీ సమ్మె కొత్త మలుపు తీసుకోవచ్చు. ఒకవేళ ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొన్నట్లయితే ఆర్టీసీ సమ్మె రాజకీయ సమస్యగా మారినా ఆశ్చర్యం లేదు.


Related Post