ఆర్టీసీ: ఏపీలో సంబరాలు..తెలంగాణలో మరణాలు!

November 02, 2019


img

తెలంగాణలో గత 29 రోజులుగా సమ్మె జరుగుతున్నా కారణంగా అనేకమంది ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో మరికొందరు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెపట్ల కటినంగానే వ్యవహరిస్తోంది. 

సరిగ్గా ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఆమోదం తెలుపడంతో అక్కడ ఆర్టీసీ కార్మికులు సంతోషంతో పండగ చేసుకొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీలో ఒకే సమయంలో ఇంత భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉండటం విశేషం. 

ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో ఆర్టీసీ పాలకమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (పీటీడీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విలీన ప్రక్రియకు అవసరమైన విధివిధానాలను, మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీలను నియమించేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. కొత్తగా 350 ఎలక్ట్రిక్ చార్జింగ్ బస్సులను కొనుగోలు చేయడానికి పాలకమండలి ఆమోదముద్ర వేసింది. 


Related Post