నిర్భయ దోషులకు టైం దగ్గరపడింది

November 01, 2019


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసుపై దాదాపు ఏడేళ్లపాటు సుదీర్గంగా సాగిన విచారణ ఎట్టకేలకు పూర్తయింది. ఈ కేసులో దొషులుగా పేర్కొనబడిన ముఖేష్, అక్షయ్, పవన్, వినయ్ శర్మలకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబందించి న్యాయపోరాటం ఇటీవలే ముగిసింది. దాంతో తీహార్ జైల్ అధికారులు త్వరలో ఉరితీయబోతున్నట్లు వారికి నోటీసులు అందజేశారు. అయితే చట్టప్రకారం వారు రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా అవకాశం ఉంది కనుక వారం రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలని నోటీసులో సూచించారు. లేకుంటే ఆ తరువాత ఎప్పుడైనా ఉరిశిక్ష అమలుచేయవలసి ఉంటుందని నోటీసులో తెలిపారు. రాష్ట్రపతి వారికి క్షమాభిక్ష పెట్టి వారి శిక్షను తగ్గించి యావజ్జీవ జైలు శిక్షగా మార్చవచ్చు లేదా వారి క్షమాభిక్ష దరఖాస్తులను తిరస్కరించవచ్చు. కనుక నిర్భయ దొషులకు ఇక రోజులు దగ్గర పడినట్లే భావించవచ్చు. 

సుమారు 7 ఏళ్ళ క్రితం అంటే 2012, డిసెంబర్ 6న దేశరాజధాని డిల్లీలో రాత్రి 9 గంటలకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒక నర్సింగ్ విద్యార్ధినిని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కదులుతున బస్సులో చాలా దారుణంగా అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టినా తరువాత రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు.  డిల్లీ పోలీసులు వెంటనే స్పందించి వారీనందరినీ వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినప్పటికీ చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొంటూ కేసును ఇంతకాలం సాగదీసి ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ ఇప్పుడు న్యాయవిచారణ ముగిసిపోవడంతో వారికి రోజులు దగ్గర పడినట్లే.      

ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా దోషులుగా నిర్ధారించబడ్డారు. వారిలో రాంసింగ్ అనే వ్యక్తి తీహార్ జైల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మరో వ్యక్తి మైనర్ కావడంతో జువైనల్ హోంలో మూడేళ్ళ శిక్షణ పొంది హాయిగా బయటకు వెళ్ళిపోయాడు. జువైనల్ చట్ట ప్రకారం అధికారులు అతని పేరు, వివరాలు అన్నీ మార్చి కొత్త గుర్తింపుతో రహస్యంగా విడిచిపెట్టారు.


Related Post