రక్షణమంత్రితో కేటీఆర్‌ డిల్లీలో భేటీ!

October 30, 2019


img

రాష్ట్ర మున్సిపల్, ఐ‌టి శాఖల మంత్రి కేటీఆర్‌ హటాత్తుగా డిల్లీ వెళ్ళి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో బుదవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌-రామగుండం, హైదరాబాద్‌-నాగ్‌పూర్ జాతీయ రహదారులను విస్తరించడానికి హైదరాబాద్‌ జంట నగరాలలో రక్షణ శాఖ అధీనంలో గల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించవలసిందిగా కోరారు. ఈ మేరకు రక్షణమంత్రికి ఒక వినతి పత్రం ఇచ్చారు. 

రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్‌ తరువాత ద్వితీయస్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ఇంత హటాత్తుగా డిల్లీ వెళ్ళి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అవడం ఆలోచింపజేస్తోంది. రక్షణభూములు కేటాయించాలని గతంలో కూడా సిఎం కేసీఆర్‌, తెరాస ఎంపీలు కేంద్రప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు కానీ కేంద్రం కనీసం స్పందించలేదని కేటీఆర్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు అదేపనిమీద మంత్రి కేటీఆర్‌ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అవడం అనుమానాలకు తావిస్తోంది. 

గత 25 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెలో బిజెపితో సహా ప్రతిపక్షాలన్నీ పాల్గొంటుండటంతో సమ్మె ఉదృతంగా సాగుతోంది. ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ తీరును తప్పు పడుతూ బిజెపి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు కూడా ప్రభుత్వానికి చివాట్లు పెడుతూనే ఉంది. సమ్మె మొదలైనప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులు గుండెపోటుతోనో లేదా ఆత్మహత్యలు చేసుకోనో మరణిస్తూనే ఉన్నారు. ఆ కారణంగా రాష్ట్రంలో కొంత ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉంది. ఈరోజు సరూర్‌నగర్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాలు సకల జనుల సమరభేరి బహిరంగసభతో సమ్మెను మరింత ఉదృతం చేయాలని భావిస్తున్నారు. కనుక సమ్మె క్లైమాక్స్ కు చేరుకొన్నట్లే కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో తెరాస సర్కార్‌ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.  

కనుక ఆర్టీసీ సమ్మెపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా వివరణ కోరిందా లేక సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కేటీఆరే రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి తాజా పరిస్థితులను వివరించారా?లేక నిజంగానే కేవలం రక్షణశాఖ భూముల కేటాయింపు కోసమే డిల్లీ వెళ్ళి ఆయనను కలిశారా? అనే ప్రశ్నలకు త్వరలోనే రాష్ట్ర బిజెపి నేతల మాటల ద్వారా బయటపడవచ్చు.


Related Post