ఏపీలో అలా... తెలంగాణలో ఇలా...

October 29, 2019


img

తెలుగు రాష్ట్రాలలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తెరాస, వైసీపీలు ఒకే సమయంలో సమస్యల వలయంలో చిక్కుకోవడం ఆశ్చర్యకరమే. 

జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి దాదాపు ప్రతీ వారం ఏదో ఒక వర్గానికి వరాలు ప్రకటిస్తున్నప్పటికీ ప్రజలలో తీవ్ర అసంతృప్తి, అసహనం నెలకొనడం విశేషం. తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఏపీ సర్కార్‌పై సిఎం జగన్ వరుసగా ప్రకటిస్తున్న వరాల కారణంగా ఆర్ధికభారం మరింత పెరిగిపోయింది. మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదేనేమో? 

జగన్ వస్తే ఏదో చేస్తాడనుకొంటే, జరుగుతున్న పనులన్నిటినీ నిలిపివేసి రాష్ట్రాన్ని స్తంభింపజేసారని, అనాలోచిత నిర్ణయాలతో ఆర్ధికవ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. పోలవరం, రాజధాని అమరావతి పనులు నిలిచిపోవడం, ఇసుక సరఫరా నిలిచిపోవడం, దాంతో రాష్ట్రంలో నిర్మాణాలు నిలిచిపోవడం, రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన లక్షలాది పనివాళ్లు రోడ్డున పడటం, దానితో ముడిపడిన వ్యాపారస్తులు నష్టపోతుండటం, రియల్ ఎస్టేట్ స్తంభించిపోవడంతో రిజిస్ట్రేషన్లు తగ్గిపోవడం..దానితో ప్రభుత్వ ఆదాయం ఇంకా పడిపోవడంవంటివన్నీ ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తుండటంతో జగన్ పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయి. ఈ పరిణామాలు ఏపీలో టిడిపి మళ్ళీ పుంజుకోవడానికి, బిజెపి బలపడేందుకు చాలా దోహదపడుతున్నాయి. కేవలం 5 నెలలలోనే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుండటం ఆశ్చర్యకరమే. 

ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్‌ మొదటిసారి ప్రభుత్వం నడిపించినప్పుడు రాష్ట్రానికి సంబందించిన అనేక సమస్యలు, రాజకీయ సవాళ్ళు, న్యాయవివాదాలు ఎదుర్కొన్నారు. కానీ వాటన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకొంటూ చాలా సమర్ధంగా పరిపాలన సాగించారని ప్రజలు బలంగా నమ్మడం వలననే మళ్ళీ రెండోసారి గెలిపించారు. కనుక ఈసారి కేసీఆర్‌ ప్రభుత్వం పూలనావలా సాఫీగా సాగిపోవాలి కానీ ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోంది. సమ్మె కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు తమ కష్టాలకు ఎవరిని నిందించాలో, ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని విచిత్ర పరిస్థితులు నెలకొనున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంతో బలహీనంగా కనబడిన ప్రతిపక్షాలన్నిటినీ సిఎం కేసీఆర్‌ స్వయంగా ఒక్క తాటిపైకి తీసుకువచ్చినట్లయింది. ఫిరాయింపులతో బలహీనపడిన కాంగ్రెస్‌ పార్టీ సమ్మె కారణంగా మళ్ళీ బలం పుంజుకొనేందుకు మంచి అవకాశం లభించింది. అలాగే రాష్ట్రంపై కన్నేసిన బిజెపి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొంటోంది. ఒక్క తాటిపైకి వచ్చిన ప్రతిపక్షాలు నలువైపుల నుంచి సిఎం కేసీఆర్‌పై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ సున్నితమైన ఈ సమస్య చాలా తీవ్రమైనది కూడా కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా కేసీఆర్‌ వైఖరిని గట్టిగా సమర్ధించుకొంటూ మాట్లాడలేని విచిత్ర పరిస్థితి నెలకొంది. దాంతో వారి మౌనాన్ని కూడా ప్రతిపక్షాలు, ఆర్టీసీ జేఏసీ నేతలు తమకు అనుకూలంగా ఉపయోగించుకొంటుండటంతో వారు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా వెనకడుగువేయకపోవడంతో ప్రభుత్వ వ్యవహారాలలో న్యాయస్థానం జోక్యం చేసుకొనే పరిస్థితులు తలెత్తాయి. ఆర్టీసీ సమ్మె...కేసీఆర్ నిర్ణయాలు...వాటిపై హైకోర్టులో జరుగుతున్న పరిణామాల వలన ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. పాలనపై దృష్టి పెట్టవలసిన ఈ సమయంలో సిఎం కేసీఆర్‌ పూర్తిసమయం ఆర్టీసీ సమ్మెపైనే పెట్టవలసివస్తోంది. నాలుగున్నరేళ్ళు ఎదురులేదన్నట్లు పాలన సాగించిన సిఎం కేసీఆర్‌, ఏడాది పూర్తికాక మునుపే ఇటువంటి వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుండటం ఆశ్చర్యకరమే.


Related Post