టీఎస్‌ఆర్టీసీలో కొనసాగుతున్న మృత్యుఘోష

October 29, 2019


img

ఆర్టీసీ సమ్మె మొదలై నేటికి 24 రోజులు అయ్యింది కానీ అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాల మద్య రాజీ కుదరలేదు. దాంతో ప్రభుత్వం ఆర్టీసీలో పెద్ద ఎత్తున అద్దె బస్సులను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. అది చూసి తమ ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళనతో కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటుండగా, మరికొందరు తీవ్ర ఆందోళనతో గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇక తాత్కాలిక డ్రైవర్ల తప్పిదాల వలన బస్సుల క్రింద పడి చనిపోయేవారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతూనే ఉంది. మొత్తంగా చూస్తే టీఎస్‌ఆర్టీసీలో ఇప్పుడు భయానకమైన మృత్యుఘోష వినిపిస్తోంది. 

నిన్న ఒకే రోజు ఇద్దరు మహిళా కండక్టర్లు చనిపోయారు. ఖమ్మంజిల్లాలో సత్తుపల్లి డిపోకు చెందిన నీరజ (31) ఉద్యోగం పోతే తనపైనే ఆధారపడిన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనే బెంగతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. భర్త రాజశేఖర్ ప్రైవేట్ ఉద్యోగి కావడంతో కుటుంబం ఆమె సంపాదనపైనే గడుస్తోంది. వారికి పూజిత (10) విశాల్ (7) అనే ఇద్దరు చిన్న పిల్లలున్నారు. నీరజ ఆత్మహత్యతో వారిరువురూ తల్లి లేనివారయ్యారు. కుటుంబం రోడ్డున పడింది. 


సిద్ధిపేట జిల్లాలో హుస్నాబాద్ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గడ్డం లతామహేశ్వరి (30) గత కొంతకాలంగా గుండె సంబందిత సమస్యలతో బాధపడుతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం చాలా కటినంగా వ్యవహరిస్తుండటంతో ఆమె తీవ్ర ఆందోళనచెందుతున్నారు. కుటుంబ సభ్యులు ఆమెను సముదాయిస్తున్నప్పటికీ ఆమె జరుగుతున్న పరిణామాలను చూస్తూ తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరిగిన విచారణకు సంబందించి టీవీలో వస్తున్న వార్తలు చూస్తూ తీవ్ర ఆందోళనకు గురై సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్‌ అర్బన్ జిల్లాలో గోపాల్‌పూర్‌కు చెందిన ఆమెకు భర్త, 10-12 ఏళ్ళలోపు వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.   

సత్తుపల్లిలో మహిళా కండక్టర్ నీరజ ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనైన ఆర్టీసీ డ్రైవర్ లగ్గాల రాంబాబు పరిగెత్తుకొని వెళ్ళి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు క్రిందపడి ఆత్మహత్య చేసుకోబోయాడు. కానీ తోటికార్మికులు పక్కకు లాగేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సెప్టెంబర్ జీతాలు అందకపోవడంతో ఆయన తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.   

వికారాబాద్ జిల్లాలోని పరిగి డిపోకు చెందిన బి.వెంకటయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం పరిగి డిపో వద్ద ధర్నా చేస్తున్నప్పుడు, పరిగెత్తుకొని వెళ్ళి డిపోలో నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు క్రింద పడి ఆత్మహత్య చేసుకోబోయారు. కానీ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి నిలిపివేయడంతో బ్రతికిపోయాడు. ఆర్టీసీ యాజమాన్యం సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకపోవడంతో ఆయన కూడా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో డిగ్రీ చదువుతున్న పెద్ద కూతురుకు కాలేజీ ఫీజు కట్టవలసి ఉంది. కానీ జీతాలు అందకపోవడంతో కట్టలేకపోయారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని వెంకటయ్య తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆ ఆందోళనతోనే బస్సు క్రింద పడి ఆత్మహత్య చేసుకోబోయారు. 

 ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోవడంతో కరీంనగర్‌ ఆర్టీసీ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో క్యాజువల్ వర్కర్‌గా పనిచేస్తున్న టి.కుమారస్వామికి పనిలేకుండాపోయింది. సమ్మె ఇంకా ఎప్పటికీ ముగుస్తుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్న ఆయనకు సోమవారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో బ్రతికిపోయారు. ప్రస్తుతం ఆయన ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. నెలరోజులుగా జీతాలు లేక అల్లాడుతున్న వారి కుటుంబం ఇప్పుడు ఆయన చికిత్సకు డబ్బు కోసం నలుగురి ముందు చేతులు చాచవలసివస్తోంది. 

ఈ మరణాలన్నిటికీ బాధ్యత ప్రభుత్వానిదా లేక సమ్మను కొనసాగిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలదా?అనే వాదోపవాదాలను పక్కనపెట్టి ప్రభుత్వం మానవతా దృక్పదంతో వ్యవహరిస్తే ఇకనైనా టీఎస్‌ఆర్టీసీలో ఈ మృత్యుఘోష నిలుస్తుంది. లేకుంటే సమ్మె సాగుతున్న ఒక్కో రోజుకు కొన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దాంతో వారిపైనే ఆధారపడున్న వారి పిల్లలు అనాధలుగా మారే ప్రమాదం ఉంది. 


Related Post