ప్రజాప్రతినిధి అంటే అలా ఉండాలి

October 28, 2019


img

గల్లీ స్థాయి నేతలు సైతం హంగు, ఆర్భాటాలు ప్రదర్శిస్తూ ప్రజల పట్ల అహంభావం ప్రదర్శిస్తుండే ఈరోజుల్లో రాష్ట్ర ఆర్ధిక మంత్రి వంటి అత్యున్నత పదవిలో ఉన్న హరీష్‌రావు తన నియోజకవర్గం ప్రజల పట్ల చూపిస్తున్న ఆధరాభిమానాలు, వారి సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరుపై ట్విట్టర్‌లో వచ్చిన ఒక వీడియో వైరల్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఆయనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేసుకొంటున్నారు. 

ఇంతకీ అది దేని గురించి అంటే...మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్నప్పుడు స్థానిక ప్రజలు ఆయన వద్దకు వచ్చి తమ సమస్యలను చెప్పుకొంటుంటారు. ఆయన యధాశక్తిన వాటిని పరిష్కరిస్తుంటారు. కానీ ఆర్ధికమంత్రి పదవి చేపట్టిన తరువాత ఆయన హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండవలసి వస్తోంది. దాంతో సిద్దిపేట ప్రజలు ఆయనను కలిసేందుకు హైదరాబాద్‌ తరలివస్తున్నారు. ఇటీవల కొందరు వచ్చి ఆయనను హైదరాబాద్‌లో కలిసారు. ఆ సందర్భంగా  హరీష్‌రావు వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదే వైరల్ అయ్యింది. 

ఇంతకీ హరీష్‌రావు ఏమి మాట్లాడారంటే, “నేను వారానికి 3 రోజులు ఇక్కడ, 4 రోజులు సిద్ధిపేటలోనే ఉంటాను. అయినా మీరు తెల్లవారుజామున లేచి రూ.5,000 ఖర్చుపెట్టుకొని ఇంత దూరం వచ్చారు. మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని, మీ పనులుమానుకొని ఇంత దూరం వస్తున్నారంటే మీకు నేను సరిగా సేవలందించలేకపోతున్నాననే అర్ధం. మీరు వ్యయప్రయాసలకోర్చి ఇంత దూరం వచ్చినప్పటికీ ఒక్కోసారి నేను మీ పనులు చేయలేకపోవచ్చు. అప్పుడు మీరు బాధపడతారు. మీరు బాధపడితే నాకు బాధ కలుగుతుంది. కనుక అత్యవసరమైతే తప్ప ఎవరూ హైదరాబాద్‌ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సిద్ధిపేటలో ఉన్నప్పుడు కలిస్తే మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను,” అని అన్నారు. ఆ వీడియోను మీరు చూడండి.. ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలని మీరూ ఒప్పుకొంటారు. 



Related Post