ఆర్టీసీ చర్చలు ఫలిస్తాయా... డౌటే!

October 26, 2019


img

ప్రభుత్వం నియమించిన టి.వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు-ఆర్టీసీ జేఏసీ నేతలు ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ భవనంలో కొద్దిసేపటి క్రితం చర్చలు ప్రారంభించారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధానడిమాండ్‌, ఆర్ధిక అంశాలతో ముడిపై ప్రభుత్వం ఆర్ధికభారం పెంచే డిమాండ్లు తప్ప మిగిలినవాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ముందే మీడియాకు లీకులు వచ్చాయి. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సహా ఏ ఒక్కదానిపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు ముందే ప్రకటించి చర్చలకు బయలుదేరారు. ఈవిధంగా ఇరువర్గాలు ముందుగానే నిర్ణయాలు, షరతులతో భేటీ అవుతున్నారు కనుక చర్చలు ఫలించడం కష్టమేనని భావించవచ్చు. 

యూనియన్ నేతల కారణంగానే సమ్మె జరుగుతోందని, సమ్మె చేస్తున్న 48,900 మంది ఆర్టీసీ కార్మికులు ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారని ఇంతకాలం వాదించిన సిఎం కేసీఆర్‌, ఇప్పుడు అదే యూనియన్ నేతలతో ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కార్మికుల డిమాండ్లపై చర్చలు జరుపవలసి రావడం, అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా, ఆర్ధికపరమైన డిమాండ్లకు తలొగ్గకూడదని ముందే నిర్ణయించుకొన్న ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలకు సిద్దపడటం గమనిస్తే ఇరుపక్షాలపై ఎంత ఒత్తిడి ఉందో అర్ధమవుతుంది. 

ఇప్పటికే 22 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది కనుక ఈరోజు జరుగుతున్న ఈ చర్చలు విఫలమైతే అటు ప్రభుత్వంపై, ఇటు ఆర్టీసీ కార్మికులపై కూడా ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు సమస్య ఇంకా జటిలమవుతుంది. ఇరువర్గాలకు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుంది. కనుక ఇరువర్గాలు రాజీపడక తప్పదు. కానీ రాజీపడే సూచనలు మాత్రం కనిపించడం లేదు. మరికొద్ది సేపటిలో చర్చలు ముగిస్తే ఏ విషయమూ తెలుస్తుంది కనుక అంతవరకు ఆర్టీసీ కార్మికులందరూ ఎదురుచూడక తప్పదు.


Related Post