కేసీఆర్‌కు ఎప్పుడూ ఎన్నికల ధ్యాసే: షబ్బీర్ ఆలీ

October 26, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ ఆలీ శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు ఎన్నికలపై ఉన్న శ్రద్ద ప్రజాసమస్యలపై లేదు. గత 21 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా ప్రగతి భవన్‌లో కూర్చొని హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలలో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రూ.50 కోట్లు ఖర్చు పెట్టి తెరాస గెలిచింది. ఉపఎన్నికలలో గెలవగానే సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా చులకనగా, అహంకారంగా మాట్లాడారు. ఆర్టీసీని మూసివేయడానికి అది ఆయన సొంత జాగీరుకాదు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలో నుంచి తొలగిస్తామంటే చూస్తూ ఊరుకోము. ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం తక్షణం చర్చలు ప్రారంభించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను ముగించాలి. రాష్ట్రంలో విషజ్వరాలు పెరిగిపోయి ప్రజలు ఆసుపత్రులపాలవుతున్నారు. ఖమ్మం కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జయమ్మ డెంగ్యూ జ్వరంతో చనిపోయారంటే పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చు. కనుక ఇకనైనా సిఎం కేసీఆర్‌ ప్రజాసమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరిస్తే బాగుంటుంది,” అని అన్నారు.  

కాంగ్రెస్‌ నేత షబ్బీర్ ఆలీ మాటలు కాస్త చేదుగా ఉన్నప్పటికీ సిఎం కేసీఆర్‌కు ఎన్నికల ధ్యాస కాస్త ఎక్కువేనని అందరికీ తెలుసు. సిఎం కేసీఆర్‌ మొదటిసారి అధికారంలో వచ్చినప్పటి నుంచే 2019లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెరాసకు ఎదురులేకుండా చేసుకొనేందుకు ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను, నేతలను ఫిరాయింపులను ప్రోత్సహించడం అందరూచూశారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరుగవలసి ఉండగా ఎటువంటి బలమైన కారణం లేకుండా ఆరునెలలు ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో గెలిచిన తరువాత వెంటనే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. వీలైతే జాతీయరాజకీయాలలో చక్రం తిప్పాలనే ఉద్దేశ్యంతో ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటుకు రాష్ట్రాలు కలియతిరిగారు. ఆ తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలొచ్చాయి. వరుస ఎన్నికలతో జనాలు విసుగెత్తిపోయారు కానీ తెరాస కాదు. అన్ని ఎన్నికలను పూర్తిచేసుకొంటే మిగిలిన నాలుగున్నరేళ్ళు పూర్తిగా పాలనపై దృష్టిపెట్టవచ్చునని సిఎం కేసీఆర్‌ అన్నారు. కానీ దాదాపు ఏడాదిగా రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మున్సిపల్ ఎన్నికలు జరుగవలసి ఉంది. అవీ ఒకేసారి జరుగాయో లేదో తెలీదు.  

ఎన్నికలలో గెలవాలనుకోవడం వేరు...ఎన్నికలు చిన్నవైనా పెద్దవైనా తెరాసయే గెలిచి తీరాలనుకోవడం వేరు. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల మొదలు అసెంబ్లీ, లోక్‌సభ, మున్సిపల్ అన్ని ఎన్నికలలో తెరాస గెలిచి తీరాలనుకోవడం వలన మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ నిత్యం ఆ ధ్యాసలోనే ఉంటున్నారు. ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరిగిపోతే పరువాలేదు. కానీ న్యాయవివాదాల కారణంగా కొన్నిటికి ఎన్నికలు జరుగకపోతే మళ్ళీ వెంటనే వాటికి ఎన్నికలు వస్తాయి. తెరాసలో మళ్ళీ వాటి హడావుడి మొదలవుతుంది. కనుక ప్రభుత్వానికి ప్రజాసమస్యల గురించి ఆలోచించే తీరిక ఎక్కడుతుంది?అని షబ్బీర్ ఆలీ ప్రశ్నకు తెరాస నేతలే జవాబు చెప్పాలి. 


Related Post