ఆర్టీసీ సమస్యను కాంగ్రెస్‌, బిజెపిలు పరిష్కరించగలవా?

October 25, 2019


img

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలతో సహా అన్ని ప్రతిపక్షపార్టీలు పూర్తి మద్దతు పలుకుతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ తన వైఖరిని నిష్కర్షగా తెలియజేశారు. అవసరమైతే ఆర్టీసీని మూసివేస్తాను తప్ప ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్లకు తలొగ్గబోమని స్పష్టం చేశారు. కనుక ఆర్టీసీ కార్మికుల ముందు ఇప్పుడు రెండే దారులున్నాయి. 1.బేషరతుగా సమ్మె విరమించి తక్షణం విధులలో చేరడం. 2. కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాల మద్దతుతో సమ్మెను ఉదృతం చేసి ప్రభుత్వంతో పోరాడటం. ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. కనుక వారు కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలను నమ్ముకొని ముందుకుసాగవలసి ఉంటుంది. 

అయితే ప్రతిపక్షాలు ఏ రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తాయనుకోలేము. ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది. కనుక రాష్ట్రంలో మళ్ళీ బలం పుంజుకొనేందుకు బేషరతుగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తుంది. వామపక్షాలకు ప్రజలు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా ఎల్లప్పుడూ అవి కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటాయి కనుక అవి తుదివరకు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడతాయి. అయితే కాంగ్రెస్‌, వామపక్షాలు సమ్మెలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సాయపడగలవేమో కానీ మొండిపట్టు పట్టి కూర్చోన్న సిఎం కేసీఆర్‌ను ఒప్పించలేవు. 

కనుక సమ్మెకు బిజెపియే ముగింపు పలికించగలదు. కానీ ఈ విషయంలోనే సిఎం కేసీఆర్‌ బిజెపికి ముందరి కాళ్ళ బంధం వేసేరు. 1950 నాటి మోటారు వాహనాల చట్టానికి మోడీ ప్రభుత్వమే సవరణలు చేసి ఆర్టీసీలను ప్రైవేటీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు ఇచ్చిందని, కానీ రాష్ట్ర బిజెపి నేతలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలుకుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌ వాదిస్తున్నారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఇవాళ్ళ ఆర్టీసీ జేఏసీ నేతలతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల కోసం అవసరమైతే డిల్లీ స్థాయివరకు ఉద్యమాన్ని తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరుపై తమ అధిష్టానం కూడా దృష్టి సారిస్తోందన్నారు. 

ఒకవేళ బిజెపి ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయదలిస్తే కేంద్రప్రభుత్వం అధికారికంగా ఏవైనా చర్యలు చేపట్టాలి లేదా బిజెపి అధిష్టానం రాజకీయంగా చర్యలు చేప్పటాల్సి ఉంటుంది. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కలలు కంటున్న బిజెపికి ఇది చాలా మంచి అవకాశమే కానీ మోటారు వాహనాల చట్టానికి తమ ప్రభుత్వమే చట్టసవరణలు చేసినందున ఈ విషయంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. వేస్తే కేసీఆర్‌ ప్రశ్నిస్తారు వేయకపోతే ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తారు. కనుక కేంద్రప్రభుత్వమే ఏదోవిధంగా సిఎం కేసీఆర్‌కు నచ్చజెపాల్సి ఉంటుంది. ఒకవేళ సాధ్యం కాదనుకుంటే ఇక ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలను వారే కోర్టు ద్వారా పరిష్కరించుకోక తప్పదు.


Related Post