ఆర్టీసీ కార్మికులలో చీలిక మొదలైందా?

October 25, 2019


img

సిఎం కేసీఆర్‌ తాజా హెచ్చరికలు, బుజ్జగింపులతో గత 21 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులలో చీలిక మొదలైందా?అంటే అవుననిపిస్తోంది. 

యూనియన్లు విడిచిపెట్టివస్తే ఆర్టీసీ కార్మికులను మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకొంటామని, లేకుంటే ఒకేసారి 7,000 ప్రైవేట్ బస్సులు ప్రవేశపెట్టి ఆర్టీసీని మూసివేస్తామన్నట్లు సిఎం కేసీఆర్‌ మాట్లాడారు. తనమాట విని వచ్చి విధులలో చేరి బుద్ధిగా పనిచేసుకొంటే రెండేళ్ళలో లక్ష రూపాయలు బోనస్ కూడా అందుకునే అవకాశం ఉందని కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు ఆశజూపారు.

సెప్టెంబర్ నెల జీతాలు అందక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులను సిఎం కేసీఆర్‌ మాటలు ఆలోచింపజేసి ఉంటే ఆశ్చర్యం లేదు. బహుశః కూకట్‌పల్లి డిపోకు చెందిన  రాజు అనే ఆర్టీసీ డ్రైవర్ ఆవిధంగానే ప్రభావితుడై ఉండవచ్చు. అతను శుక్రవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే విషాన్ని అశ్వధామరెడ్డి కార్మికులలో జొప్పించారని, దాంతో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు గుండెపోటు, ఆత్మహత్యలతో చనిపోతున్నారని, వారి మరణాలకు అశ్వధామరెడ్డిదే బాధ్యత అని కనుక ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి మంత్రి హరీష్‌రావుతో చర్చించి ఉండి ఉంటే ఏమైనా ఫలితం ఉండేదని కానీ కొందరు ఆర్టీసీ జేఏసీ నేతలు ఆయనపై కూడా అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని డ్రైవర్ రాజు పిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ...కార్మికుల క్షేమం కోరి సిఎం కేసీఆర్‌ నిన్న చాలా మంచి ప్రతిపాదనలు చేశారని కనుక ఆర్టీసీ కార్మికులందరూ అశ్వధామరెడ్డిని పక్కనపెట్టి తక్షణం విదులలో చేరి ఉద్యోగాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులపై అశ్వధామరెడ్డికి అంతా ప్రేమాభిమానాలు ఉంటే ఆయన ఒక్కరే ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి ఆర్టీసీ కార్మికుల  సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులను మాత్రం పనిచేసుకొనివ్వాలని డ్రైవర్ రాజు సలహా ఇచ్చారు.

డ్రైవర్ రాజు సిఎం కేసీఆర్‌ మాటలకు ప్రభావితుడయ్యారా లేక తెరాస నేతలెవరైనా వెనక నుంచి ప్రోత్సహించడంతో ఆయన ఈ పనిచేశారా అనే విషయాన్ని పక్కనపెడితే, ఈ అనూహ్య పరిణామం కార్మికులలో చీలికకు, తద్వారా సమ్మె విచ్చినం కావడానికి తొలి ప్రయత్నంగా భావించవచ్చు.


Related Post