ఆర్టీసీ సమస్యను కమిటీలు, నివేదికలు పరిష్కరించగలవా?

October 25, 2019


img

టీఎస్‌ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ నిష్కర్షగా నిన్న తన అభిప్రాయం చెప్పారు. ఆర్టీసీ కార్మికులవి గొంతెమ్మ కోర్కెలని, వాటిని తీర్చడం ప్రభుత్వం వల్ల కాదని కనుక అందరూ తక్షణమే యూనియన్లను విడిచిపెట్టి తాను చెప్పినట్లు వింటానంటే మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకొంటామని కాదని సమ్మె కొనసాగిస్తే ఆర్టీసీని మూసివేయకతప్పదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 

సిఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని, అవసరమైతే ప్రభుత్వంతో న్యాయపోరాటానికి సిద్దమని ప్రకటించారు. 

సమ్మె, డిమాండ్ల విషయంలో ఇరుపక్షాలు బిగుసుకొని కూర్చొని ఉన్నాయి కనుక రాజీపడే అవకాశం లేదని అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం నియమించిన టి.వెంకటేశ్వరరావు కమిటీ నేడు ఆర్టీసీ కార్మికుల 21 డిమాండ్లపై ప్రభుత్వానికి తన నివేదిక ఇవ్వనుంది. 

సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పినందున ఆ నివేదికలో సూచించినట్లుగా సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల 21 డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తారా లేక ఆ నివేదికను హైకోర్టులో ప్రభుత్వ వాదనలను బలపరుచుకొనేందుకు ఆయుధంగా ఉపయోగించుకొంటారా? అనేది ఈరోజు సాయంత్రంలోగా తేలిపోతుంది.   

అలాగే సమ్మె చేస్తే ఆర్టీసీని మూసివేస్తామనే సిఎం కేసీఆర్‌ తీవ్ర హెచ్చరికలు, యూనియన్లు వీడితే మళ్ళీ ఉద్యోగాలలో చేరవచ్చనే  షరతులు, రెండేళ్ల తరువాత లక్ష రూపాయల బోనస్ ఇస్తామనే తాయిలాలతో ఆర్టీసీ కార్మికులలో చీలిక ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఆర్టీసీ కార్మికులు సంఘటితంగా సమ్మె కొనసాగించగలరా లేదా అనే విషయం కూడా త్వరలో తెలియవచ్చు.


Related Post