ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం

October 24, 2019


img

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరైన నిర్ణయం కాదన్నట్లు సిఎం కేసీఆర్‌ ఈరోజు మాట్లాడారు. యాదృచ్ఛికంగా ఇవాళ్ళే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపిఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తూ నిర్ణయం తీసుకొంది. విలీన ప్రక్రియను సాఫీగా పూర్తి చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను, ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు, పోస్టులకు గ్రేడ్స్ వర్తింపు, సంస్థ పునరుద్దరణకు చేపట్టవలసిన చర్యలు తదితర అన్ని అంశాలపై అధ్యయనం చేసి సిఫార్సులతో కూడిన నివేదికను రూపొందించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నేడు ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఆర్టీసీ, రవాణా, ఆర్ధిక, సాధారణ పరిపాలన, న్యాయశాఖలకు చెందిన ఉన్నతాధికారులను సభ్యులుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీ నవంబర్ 15వ తేదీలోగా నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని గడువు కూడా విధించింది.

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏపిఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మంచిదని భావించినందునే విలీనం జరుగుతుంటే, కేసీఆర్‌ మంచిది కాదనుకోవడం వలన జరగడం లేదు. అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా వద్దా? అనే నిర్ణయం ఆర్టీసీ సంస్థ, కార్మికుల అవసరాన్ని బట్టి కాక ముఖ్యమంత్రుల సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలు, అవసరాలను బట్టి నిర్ణయించబడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సరైన నిర్ణయమా కాదా? దాని వలన ఆర్టీసీసంస్థకు, కార్మికులకు, ప్రజలకు మేలు కలుగుతుందా లేక సిఎం కేసీఆర్‌ ఊహిస్తున్నట్లు ఈ ప్రయోగం బెడిసికొడుతుందా? అనే సందేహాలకు సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు రాబోయే 6 నెలలో సమాధానాలు లభించవచ్చు.


Related Post