ఆర్టీసీ కేసీఆర్‌ జాగీరు కాదు..మేము పాలేర్లమూ కాము

October 24, 2019


img

సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ సమ్మెపై చేసిన తీవ్రవ్యాఖ్యలపై ఆర్టీసీ నేతలు, ప్రతిపక్ష నేతలు వెంటనే అంతకంటే ఘాటుగా స్పందించడం మొదలుపెట్టారు. 

ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీని మూసేయడానికి అది సిఎం కేసీఆర్‌ జాగీరు కాదు..ఎప్పుడంటే అప్పుడు మమ్మల్ని ఉద్యోగాలలో పీకేయడానికి మేము ఆయన ఫాంహౌసులో పాలేర్లమూ కాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఆయనే స్వయంగా కరీంనగర్‌ సభలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడది గొంతెమ్మ కోర్కె అంటున్నారు. మావి గొంతెమ్మ కోర్కెలు కావని హైకోర్టు కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడారు. ఆయన అహంకారానికి పరాకాష్టగా ఉన్నాయి ఆయన మాటలు. యూనియన్ల వలన ఆర్టీసీ నష్టపోతోందని, మునుగుతోందని అన్నారు కానీ యూనియన్లే ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్ పరం కాకుండా ఇంతకాలం కాపాడుకొన్నాయని అందరికీ తెలుసు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులలో ఉందని చెపుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడటానికి ఎవరు కారకులు? సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులను బెదిరించి భయపెట్టి లొంగదీసుకోవాలనుకొంటున్నారు. సిఎం కేసీఆర్‌ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని ఆర్టీసీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఉద్యోగాలను ఎవరూ పీకలేరు. పీకితే న్యాయస్థానాలు లేవా? మన డిమాండ్లు సాధించుకునే వరకు కలిసికట్టుగా ప్రభుత్వంతో పోరాడుదాము. ఈనెల 30న సరూర్ నగర్‌  జరుపబోయే సకలజనుల సమర భేరిని విజయవంతం చేసి చూపిద్దాం,” అని అన్నారు. 


Related Post