ఆర్టీసీని ఇక ఎవరూ కాపాడలేరు: కేసీఆర్‌

October 24, 2019


img

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించడంతో సిఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై సుమారు గంటసేపు మాట్లాడి నిష్కర్షగా తన అభిప్రాయాలను చెప్పారు. 

“ఆర్టీసీ ఇప్పటికే దివాళా తీసింది. దానిని ఎవరూ కాపాడలేరు. గొంతెమ్మ కోర్కెలు కోరుతూ సమ్మె చేస్తే వాటిని తీర్చగల శక్తి, అవసరం ప్రభుత్వానికి లేవు. ఇటువంటి కారణాల చేతనే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో ఆర్టీసీలు మూతపడ్డాయి. ఈ సమ్మె ఇంకా కొనసాగితే మన ఆర్టీసీ కూడా మూతబడుతుందని గ్రహించాలి. ఆర్టీసీని కాపాడాలనే నేను కోరుకొంటున్నాను. కానీ కొందరు యూనియన్ నేతల చిల్లర రాజకీయాలతో ఆర్టీసీ మూతపడే పరిస్థితికి వచ్చింది. 

ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మేము చేయాలా? అలా చేస్తే ఏమవుతుందో 3-6 నెలలోనే ఏపీలో చూస్తాము. కనుక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే పిచ్చి పిచ్చి డిమాండ్‌లకు అంగీకరించే ప్రసక్తే లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మిగిలిన 57 కార్పొరేషన్ ఉద్యోగులు ఊరుకొంటారా? వారు కూడా తమను ప్రభుత్వంలో విలీనం చేయమంటే చేయగలమా? అర్ధంపర్ధం లేకుండా నోటికి వచ్చిన డిమాండ్లు అడిగితే వాటన్నిటినీ మేము తీర్చాలా? తీర్చకపోతే సమ్మె చేస్తారా? చేస్తే నష్టపోయేది ఎవరు? మీరే కదా? యూనియన్ నేతల చిల్లర రాజకీయాల కోసం మీ కాళ్ళను మీరే నరుకొంటున్నారని గ్రహించి ముందే మెల్కోంటే మీకే మంచిది.  

మేము అధికారంలోకి రాకమునుపు ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు, ఆర్టీసీ పరిస్థితి ఏవిధంగా ఉంది? ఇప్పుడు ఏవిధంగా ఉంది? అని ఆర్టీసీ కార్మికులందరూ ఓసారి ఆలోచించుకొంటే ఇటువంటి పిచ్చిపిచ్చి డిమాండ్లతో సమ్మె చేసేవారు కాదు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాము. 14 శాతం ఐఆర్ ఇచ్చాము. గతంలో ఎవరైనా ఎప్పుడైనా ఇంత ఇచ్చారా? ఆర్టీసీ కార్మికులకు సగటున 50,000 జీతం వస్తుంటే ఇంకా జీతాలు పెంచాలని గొంతెమ్మ కోర్కెలు కోరితే ఎలా? ఎక్కడి నుంచి తేవాలి?

రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమ మనుగడ కోసం ఆర్టీసీ కార్మికులను ఎగద్రోస్తున్నాయి. ప్రజాధారణ కోల్పోయిన ప్రతిపక్షాలు ఎక్కడ 10 మంది జనాలు కనబడితే అక్కడ చేరిపోయి ఈవిధంగా చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. అవేవి ఆర్టీసీని కాపాడలేవు. తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తూ ఆర్టీసీని నిలువునా ముంచే ప్రయత్నం చేస్తున్నాయి. 

ఆర్టీసీలో పోటీతత్వం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టవచ్చునని ఇటీవలే కేంద్రప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది. కనుక కార్మికులు నా మాట విని బుద్దిగా పనిచేసుకొంటే ఆర్టీసీని లాభాలబాట పట్టించి రెండేళ్ళలోగా బోనసులు అందుకునే స్థితికి తీసుకువస్తాను. లేకుంటే ఒక్క సంతకంతో వారం రోజులలోపుగా 7000 అద్దె బస్సులను రోడ్లపైకి తీసుకువస్తాను. 

సమ్మె విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించిందంటూ మీడియాలో ఏదేదో వ్రాశారు. కానీ హైకోర్టు ఏమి చెప్పిందంటే ‘ఆర్టీసీ సమ్మె వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కనుక చర్చలు జరిపి వీలైనంత త్వరగా సమ్మె ముగించమని’ సూచించింది అంతే! 

అయినా ఆర్టీసీ దివాళా తీసి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే హైకోర్టు మాత్రం ఏమి చేస్తుంది? ఒకవేళ లేబర్ కోర్టుకు వెళితే ఆర్టీసీ బస్టాండ్లను, బస్సులను అమ్మైనా జీతాలు చెల్లించమంటుంది. అప్పుడు ఏమవుతుందో ఎవరైనా ఆలోచించారా?జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేనప్పుడు మీ గొంతెమ్మ కోర్కెలన్నిటినీ తీర్చడం సాధ్యం కాదు. కాదంటే ఆర్టీసీని శాస్వితంగా మూసుకోవలసిందే. 

కనుక ఆర్టీసీ కార్మికులందరూ తక్షణం బేషరతుగా సమ్మె విరమించి, ఇకపై యూనియన్లలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి మళ్ళీ ఉద్యోగాలలో చేరవచ్చు. ఇదే వారికి చివరి అవకాశం. కాదని సమ్మె కొనసాగిస్తే ఆర్టీసీ మూతపడుతుంది. వాళ్ళే రోడ్డున పడతారు,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.


Related Post