ఆర్టీసీ కార్మికులకు నేడు జీతాలు అందుతాయో...లేదో?

October 21, 2019


img

సమ్మె చేస్తున్న 48,900 మంది ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలను ఆర్టీసీ యాజమాన్యం ఇంతవరకు చెల్లించకపోవడంతో కార్మిక సంఘాలు హైకోర్టులో పిటిషన్‌ వేయగా సోమవారంలోగా అందరికీ జీతాలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అందుకు ప్రభుత్వ న్యాయవాది కూడా అంగీకరించారు. కనుక ఆర్టీసీ కార్మికులకు నేడు జీతాలు చెల్లించవలసి ఉంది. 

జీతాలు చెల్లించడానికి నిధుల కొరత అని ప్రభుత్వం చెపుతుంటే, సిబ్బంది కొరత అని ఆర్టీసీ యాజమాన్యం చెపుతుండటంతో ఆర్టీసీ కార్మికులలో ఆందోళనగా ఉన్నారు. కానీ సమ్మె చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వదలచుకోలేదని కొన్ని రోజుల క్రితమే సిఎం కేసీఆర్‌ చెప్పినందున నిధులు, సిబ్బంది కొరత కారణాలు కావని స్పష్టం అవుతోంది. అయినప్పటికీ జీతాల చెల్లింపుకు సిబ్బంది కొరత ఉన్నట్లయితే దాని కోసం సమ్మె చేస్తున్న ఉద్యోగులను పంపించడానికి ఆర్టీసీ జేఏసీ సంసిద్దత వ్యక్తం చేసింది. జీతాల చెల్లింపుకు సహకరిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనను ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోలేదు. నేడు తప్పనిసరిగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలనే హైకోర్టు ఆదేశాలపైన ఇంతవరకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించలేదు. అలాగే శనివారం ఉదయం 10.30 లోపుగా ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు ప్రారంభించి మూడు రోజులలోగా ముగించి వీలైనంత త్వరగా ఆర్టీసీ సమ్మెను విరమింపజేయాలనే హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. కనుక నేడు జీతాలు చెల్లించాలనే హైకోర్టు ఆదేశాలనైనా ప్రభుత్వం పట్టించుకొంటుందా లేక ఏదో సాకుతో వాయిదా వేస్తుందో తెలియదు. సెప్టెంబర్ జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులు ఈరోజైనా ఆర్టీసీ యాజమాన్యం తమకు జీతాలు చెల్లిస్తుందో లేదోనని తీవ్ర ఆందోళనతో ఉన్నారు.


Related Post