ఆర్టీసీ జేఏసీతో చర్చలు లేవు: కేసీఆర్‌

October 17, 2019


img

ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వవైఖరిలో ఎటువంటి మార్పు లేదని సిఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి త్వరగా సమ్మెను ముగింపు పలకాలని హైకోర్టు సూచించడంతో సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ అధికారులతో నిన్న రాత్రి సమావేశమయ్యి పరిస్థితి సమీక్షించారు.

మంత్రివర్గం కమిటీని ఏర్పాటు చేసి చర్చలు ప్రారంభించాలనే ప్రతిపాదనను సిఎం కేసీఆర్‌ నిర్ద్వందంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మళ్ళీ పనిలోకి తీసుకోబోమని వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోవడానికి అవసరమైయన్ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని సిఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఆర్టీసీకి ఎండీ నియామకం సాధ్యం కాదని హైకోర్టుకు తెలియజేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. 

గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు రూ.3,300 కోట్లు సాయం అందించడమే కాకుండా, ఆర్టీసీ కార్మికులకు భారీగా జీతాలు పెంచిందని సిఎం కేసీఆర్‌ అన్నారు. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు సంస్థ ఆర్ధిక పరిస్థితిని, పండుగ సమయంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా సమ్మెకు దిగి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారి వలననే ఈ 13 రోజులలో ఆర్టీసీకి రూ.150 కోట్లు నష్టం వచ్చిందని సిఎం కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్న ఆర్టీసీ కార్మికులతో ఇక చర్చలు జరుపబోమని, వారిని మళ్ళీ విధులలోకి తీసుకోబోమని హైకోర్టుకు తెలియజేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులకు తేల్చి చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి హైకోర్టుకు వివరించాల్సిందిగా ఆధికారులను ఆదేశించారు. 

హైకోర్టు జోక్యంతో ప్రభుత్వం మళ్ళీ చర్చలకు సిద్దం అవుతుందని, త్వరలోనే సమ్మె ముగిసిపోతుందని అందరూ భావిస్తుంటే, ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వవైఖరిలో ఎటువంటి మార్పు లేదని సిఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేయడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. కనుక నేటి నుంచి ఆర్టీసీ సమ్మె మరింత ఉదృతమయ్యే అవకాశం ఉంది.సిఎం కేసీఆర్‌  నిర్ణయంపై ఇప్పుడు హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.


Related Post