ప్రభుత్వంతో చర్చలకు సిద్దం: ఆర్టీసీ జేఏసీ

October 14, 2019


img

ఈరోజు ఉదయం ఆర్టీసీ ఐకాస నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి తమ డిమాండ్లు, సమ్మె గురించి వివరించి ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెరాస ఎంపీ కే కేశవరావు అంటే మాకు చాలా గౌరవం. ఆయన చొరవ తీసుకొని మధ్యవర్తిత్వం వహించి చర్చలు పునః ప్రారంభించడానికి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే మంచిదే. అయితే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వోద్యోగులతో సమానంగా గుర్తించాలని మేము కోరుకొంటున్నాము. అందుకు ప్రభుత్వం అంగీకరిస్తే మేము చర్చలకు సిద్దంగానే ఉన్నాము.   కొందరు మంత్రులే ఆర్టీసీ సమ్మెను అవహేళన చేస్తూ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారు తప్ప మేమెవరం ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టలేదు. కనుక మంత్రులు మాపై తప్పుడు ఆరోపణలు మానుకుంటే మంచిది,” అని అన్నారు. 

ఆర్టీసీ కార్మికులతో మళ్ళీ చర్చలకు సిద్దపడటం ద్వారా ప్రభుత్వం ఒకమెట్టు దిగితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌కు బదులు ప్రభుత్వోద్యోగులతో సమానంగా గుర్తిస్తే చాలని అశ్వథామరెడ్డి చెప్పడం ద్వారా ఆర్టీసీ కార్మికులు కూడా ఒక మెట్టు దిగారు. కనుక త్వరలోనే మళ్ళీ ప్రభుత్వం-ఆర్టీసీ కార్మిక సంఘాల మద్య మళ్ళీ చర్చలు పునః ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మె వలన అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కనుక ఈసారి చర్చలు ఫలవంతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Related Post