ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మెత్తబడినట్లేనా?

October 14, 2019


img

టీఎస్‌ఆర్టీసీలో నిన్న ఒకేరోజున ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగింది కనుక ఆర్టీసీ సమ్మెపై పునరాలోచన మొదలైనట్లే ఉంది. బహుశః అందుకే సిఎం కేసీఆర్‌, తెరాస ఎంపీ కే కేశవరావును రంగంలో దింపినట్లున్నారు. 

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధ కలిగించింది. అయితే బలిదానాలతో సమస్యలు పరిష్కారం కావని అందరూ గ్రహించాలి. ఆర్టీసీ కార్మికులపట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక్క డిమాండ్ తప్ప మిగిలినవన్నీ న్యాయమైనవేనని భావిస్తున్నాను. వాటిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం సమ్మెను దృష్టిలో ఉంచుకునే 30 శాతం అద్దె బస్సులను, 20 శాతం ప్రైవేట్ బస్సులను నడిపించాలని ప్రభుత్వం యోచిస్తోంది తప్ప ఆర్టీసీని ప్రవేటీకరించాలనే ఉద్దేశ్యంతో కాదు. కనుక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టకుండా మిగిలిన డిమాండ్స్ పై చర్చలకు సిద్దంకావాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

బలిదానాలు సమస్యకు పరిష్కారం కావని కే. కేశవరావు చెపుతున్నప్పటికీ ఇద్దరు కార్మికుల బలిదానాల వలననే ప్రభుత్వ ధోరణిలో హటాత్తుగా ఇటువంటి మార్పు వచ్చిందని అర్ధమవుతోంది. “సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు మా ఉద్యోగులే కారు... కనుక వారితో చర్చల ప్రసక్తే లేదు...”అని సిఎం కేసీఆర్‌, రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కానీ నానాటికీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతుండటంతో కే.కేశవరావును రంగంలోకి దింపి చర్చలకు రమ్మనమని ఆర్టీసీ కార్మికులను ఆహ్వానిస్తోంది. కనుక ఇప్పుడు బంతి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసి చేతిలో ఉన్నట్లు భావించవచ్చు. ప్రభుత్వం ఒక మెట్టు దిగి చర్చలకు సిద్దం అయ్యింది కనుక వారు కూడా ఓ మెట్టు దిగుతారా? లేక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబడతారా? చూడాలి.


Related Post