టిఎస్ ఆర్టీసీ సమ్మెకు బీజం ఏపీలో?

October 13, 2019


img

టీఎస్‌ఆర్టీసీ సమ్మెకు బీజం ఆంధ్రాలో పడిందా? అంటే అవుననే చెప్పుకోవాలి. కానీ అక్కడి రాజకీయ నేతలెవరూ కుట్ర చేయలేదు. ఏపీ సిఎంగా జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని వివిద వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు వరుసగా వరాలు ప్రకటిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. వాటిలో భాగంగానే ఏపీఎస్ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి జగన్ అంగీకరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వలన ఎదురయ్యే కష్టనష్టాలు లేదా లాభనష్టాలు ఏమిటో భవిష్యత్‌లో తెలియవచ్చు. అయితే, జగన్ నిర్ణయం వలన ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులకు ఉద్యోగ భద్రత ఏర్పడింది. వారి జీతభత్యాలు, సౌకర్యాలు, అలాగే సమాజంలో వారి గౌరవం పెరుగుతాయి. కనుక టీఎస్‌ఆర్టీసీ కార్మికులు తమకు కూడా అటువంటి మంచిరోజులు రావాలని కోరుకోవడం సహజం. అందుకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె మొదలుపెట్టారు. దానిని దురాశగానో.. ప్రభుత్వ వ్యతిరేక కుట్రగానో అభివర్ణించడం తప్పు.

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో నేరుగా రవాణాశాఖ మంత్రి లేదా మంత్రుల కమిటీ గానీ చర్చించినట్లయితే బహుశః వారు ఏదో ఒక పరిష్కారం కనుగొనగలిగి ఉండేవారేమో? కానీ సొంతంగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేని ఐఏఎస్ అధికారుల కమిటీ చర్చలు సాగించింది. ఊహించినట్లే వారి చర్చలు విఫలమయ్యాయి. దాంతో సమ్మె మొదలైంది. 

కనీసం ఇప్పటికైనా తెరాస సర్కార్ ఆర్టీసీ కార్మిక సంఘాలతో మళ్ళీ చర్చలు మొదలుపెట్టి ఉంటే ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం లభించి ఉండేదేమో కానీ సిఎం కెసిఆర్ వారితో చర్చలకు నిరాకరించడమే కాకుండా ఆర్టీసీ కార్మికుల పట్ల  కటినంగా వ్యవహరిస్తుండటంతో నానాటికీ సమ్మె ఉదృతమవుతోంది. కనుక ఈ సమ్మెకు బీజం ఏపీలో పడినా ఈ సమస్యను జటిలం చేసుకొన్నది మాత్రం తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పక తప్పదు. 

ఈరోజు ఉదయం ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ప్రవేశించాయి కనుక చివరికి ఇది ఏవిధంగా మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టమే.


Related Post