కాంగ్రెస్‌, బిజెపిలపై సిఎం కేసీఆర్‌ ఆగ్రహం

October 13, 2019


img

ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సిఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం జరిపినప్పుడు, రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదని, ఉన్న పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి, మనుగడ కోసమే ఆర్టీసీ సమ్మెకు మద్దతునిస్తున్నాయని అన్నారు. గోతికాడనక్కలా ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆర్టీసీ సమ్మెకు మద్దతునిస్తున్నాయని అన్నారు.  కేంద్రప్రభుత్వం ఎయిర్ ఇండియా, రైల్వేలను, చివరికి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను కూడా ప్రైవేటీకరిస్తోందని, కేంద్రం నిర్ణయాలను గట్టిగా సమర్ధిస్తున్న రాష్ట్ర బిజెపి నేతలు, ఇక్కడ ఆర్టీసీని కాపాడుతామంటూ చాలా మాట్లాడుతున్నారని సిఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ కార్మికులు ఆచరణ సాధ్యం కాని కోర్కెలు కోరుతూ, చట్టవిరుద్దంగా సమ్మె చేసి ప్రజలను ఇబ్బంది పెడుతుంటే, కాంగ్రెస్‌, బిజెపిలు వారికి మద్దతు ఇస్తున్నాయి. అందుకే ప్రజలు వాటిని ఆదరించడం లేదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలుచేయలేనివాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలని కోరుతున్నారన్నారు. ఇటువంటి తప్పుడు విధానాల వలననే ప్రతిపక్షాలు ప్రజాధారణ కోల్పోయాయని సిఎం కేసీఆర్‌ అన్నారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికినంత మాత్రన్న మేమేమీ భయపడబోమని, సమ్మె పేరుతో ఎవరైనా ఆరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తే వారిపై కటిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. మూడు రోజులలోగా ఆర్టీసీలోని మొత్తం అన్ని బస్సులు రోడ్లపైకి తీసుకువచ్చి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామన్నారు. 


Related Post