తెరాసలో ఓనర్ల సమస్య తీరినట్లేనా?

October 12, 2019


img

సాధారణంగా మంత్రివర్గ విస్తరణకు ముందు, తరువాత అసమ్మతిరాగాలు మాత్రమే వినిపిస్తుంటాయి. కానీ  తెరాసలో ముందెన్నడూ లేని విధంగా ‘గులాబీ జెండా ఓనర్లం మేమే’నంటూ తిరుగుబాటు స్వరాలు వినిపించాయి. కానీ ఆ తరువాత మళ్ళీ అటువంటి ధిక్కారస్వరాలు పార్టీలో వినిపించలేదు కనుక అంతా సర్దుమణిగిందనే అందరూ భావిస్తున్నారు. తెరాస నేతలు వాటిని మరిచిపోయినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఆ గొంతులను మరిచిపోకపోవడం విశేషం.

బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నిస్తుంటే, పార్టీలో సీనియర్ మంత్రులైన హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ మౌనం వహించడం సరికాదు. ఇటువంటి సమయంలోనే వారు ధైర్యంగా గొంతువిప్పి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తేనే తెరాస ఓనర్లనిపించుకుంటారు. ఆర్టీసీ కార్మికులు సమస్యతో సంబందం లేనట్లు మంత్రులు వ్యవహరించడం సరికాదు,” అని అన్నారు.

హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ పార్టీలో చాలా సీనియర్ నేతలు, మంత్రులుగా వ్యవహరిస్తున్నారు కనుక ప్రతీ సమస్యపై సమగ్ర అవగాహన కలిగి ఉన్నారు. ఎన్నికల సమయంలో అనర్గళంగా మాట్లాడగలిగే హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ వంటివారు పార్టీకి విధేయంగా ఉండాలి కనుక రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడకపోవడం సహజమే కావచ్చు కానీ ఇటువంటి ప్రజాసమస్యలపై వారు మాట్లాడి పరిష్కరించగలరనే ఉద్దేశ్యంతోనే ప్రజలు వారిని ఎన్నుకున్నారనే సంగతి మరిచిపోకూడదు. మంత్రి పదవుల కోసం గులాబీ జెండా ఓనర్లం అంటూ ధైర్యంగా మాట్లాడగలిగినప్పుడు ప్రజాసమస్యలపై ఎందుకు మాట్లాడలేరు? అనే బిజెపి ప్రశ్నకు వారే సమాధానం చెపితే బాగుంటుంది. 


Related Post