త్వరలో ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ?

October 12, 2019


img

ఆర్టీసీ కార్మిక సంఘాలు, తెలంగాణ ప్రభుత్వం వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో వాటి మద్య ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. సమ్మెలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మౌనదీక్షలు చేపడతారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి తెలిపారు. 

ఆర్టీసీని కాపాడుకోవడానికి తాము చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని భావించబట్టే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, వివిద ప్రజాసంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూ వేలాది కార్మికులను వారి కుటుంబాలను రోడ్డున పడేయాలని చూస్తోందని అశ్వథామరెడ్డి అన్నారు. కానీ ఎన్ని కష్టాలు, సవాళ్ళు ఎదురైనా తమ డిమాండ్లు నెరవేరేవరకు కలిసికట్టుగా పోరాటం కొనసాగిస్తామని అశ్వథామరెడ్డి అన్నారు. 

ఆర్టీసీ సమ్మె మొదలవగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల వైఖరిలో ఎటువంటి మార్పు కనబడకపోవడంతో సమ్మె చేస్తున్న కార్మికుల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో డిపోలవారీగా డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు ఖాళీలను గుర్తించి వాటి భర్తీకి ఆర్టీసీ అధికారులు నివేదికలు సిద్దం చేశారు. నేడు వాటిని సిఎం కేసీఆర్‌కు అందజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కనుక సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానంలో కొత్తవారిని నియమించుకోవడానికి ప్రభుత్వం వెనకాడబోదని బలమైన సంకేతాలు పంపినట్లయింది. 

కానీ 20-30 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న 48,800 ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలో నుంచి తొలగించడానికి చట్టాలు, న్యాయస్థానం అనుమతిస్తాయా? ఒకవేళ చట్టప్రకారం కొత్తవారిని నియమించుకునేందుకు వీలుపడినా దాని వలన తెరాసపై ప్రజలలో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉంటుంది కనుక సిఎం కేసీఆర్‌ నిజంగానే అంత సాహసం చేయగలరా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు.


Related Post