పిసిసి అధ్యక్ష పదవి నాకే: కోమటిరెడ్డి

October 11, 2019


img

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో నేతలు పదవుల కోసం ఎప్పుడూ పోటీలు పడుతూనే ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది. త్వరలో జరుగబోయే ఉపఎన్నికలలో హుజూర్‌నగర్‌ సీటును కైవసం చేసుకోవడానికి తెరాస గట్టిగా ప్రయత్నిస్తోంది. కనుక ఆ సీటును తిరిగి గెలుచుకోవడానికి కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారు. ఇటువంటి సమయంలో భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పిసిసి అధ్యక్ష పదవి పొందేందుకు పార్టీలో సీనియర్ నేతనైన తానే అర్హుడినని కనుక ఆ పదవి తనకే ఇవ్వాలని, పార్టీ నేతల మద్య విభేధాలున్నాయని చెప్పడం విస్మయం కలిగిస్తుంది. 

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుత పరిస్థితులలో పిసిసి అధ్యక్ష పదవి అంటే హోదా కాదు ఒక బరువైన బాధ్యత. తెరాసను గట్టిగా ఎదుర్కోవడానికి రాష్ట్రంలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవలసి ఉంది. పార్టీలో నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమనే బృహత్తర బాధ్యత ఉంది. పార్టీని నడిపించే విషయంలో గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో విభేధించిన మాట వాస్తవమే. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి వెభేధాలు, భిన్నాభిప్రాయాలు మామూలే. పార్టీలో నేనే అందరి కంటే సీనియర్‌ని. కనుక పిసిసి అధ్యక్ష పదవి ఆశించడం తప్పు కాదు. ఈసారి మా అధిష్టానం తప్పకుండా నాకే ఆ బాధ్యత అప్పగిస్తుందని భావిస్తున్నాను,” అని అన్నారు.


Related Post