ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ వైఖరి సరైనదేనా?

October 07, 2019


img

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సిఎం కేసీఆర్‌ వారిపట్ల కటినంగా వ్యవహరిస్తున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాలలో నుంచి తొలగించడం, కొత్తవారిని నియమించడం, ఆర్టీసీలో 50 శాతం అద్దె బస్సులను ప్రవేశపెట్టడం వంటి చర్యలకు సిద్దమవుతున్నారు. ఆయన నిర్ణయాలపట్ల ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఆయన వైఖరిని ఖండిస్తున్నాయి...ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతున్నాయి. ఇక ఈ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో కూడా ఒక కేసు నమోదైంది కనుక దీనిపై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. 

ఆర్టీసీ సమ్మె వలన ఆ సంస్థకు ఇంకా ఎక్కువ నష్టం, ప్రజలకు ఇబ్బందులు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. కనుక దీనికి చేదుమందు వేయవలసిందేనని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. తీవ్ర నష్టాలలో ఉన్న ఆర్టీసీని గాడిన పెట్టాలంటే ధైర్యంగా కటిననిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా పాలనచేయవలసిన బాధ్యత తనపై ఉందని సిఎం కేసీఆర్‌ భావించడం తప్పు కాదు. కానీ ఆయన తీసుకోబోతున్న నిర్ణయాలతో ఒకేసారి 48,500 మంది ఆర్టీసీ కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆర్టీసీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కొంతమంది రాజకీయ నేతలు, ఆర్టీసీ అధికారులు ఆర్టీసీలో లాభదాయకమైన మార్గాలలో అద్దె బస్సులను నడిపించుకొంటు కోట్లు సంపాదించుకుంటూ సంస్థను ఆర్ధికంగా దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. సిఎం కేసీఆర్‌ ఇప్పుడు ఏకంగా సగం బస్సులను ప్రైవేట్ చేతుల వ్యక్తులకు అప్పగిస్తే, ఆర్టీసీ గాడిన పడకపోగా ఏదో ఓ రోజు పూర్తిగా మూతపడటం ఖాయమని ఆర్టీసీ కార్మిక నేతలు, ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు. ఒకప్పుడు ప్రైవేట్ బస్ సర్వీసులు సరిగ్గా నడవడంలేదనే కారణంతోనే ఆర్టీసీ ఉద్భవించింది. మళ్ళీ ఇప్పుడు అదే ప్రైవేట్ వ్యవస్థను తీసుకువస్తే ఏమవుతుంది? అని ఆలోచిస్తే మంచిది. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు వారిపట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సిఎం కేసీఆర్‌ వాదన. కానీ ఒకేసారి వేలాదిమంది కార్మికులను ఉద్యోగాలలో పీకేస్తామని బెదిరిస్తూ సిఎం కేసీఆర్‌ చాలా నిరంకుశత్వంగా, అహంభావంతో వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కనుక ఈ వ్యవహారంలో సిఎం కేసీఆర్‌, ఆర్టీసీ కార్మికులలో ఎవరి వైఖరిని ప్రజలు సమర్ధిస్తారు? ఎవరి వైఖరిని తప్పు పడుతున్నారు? ఆర్టీసీ విషయంలో సిఎం తీసుకోబోయే కేసీఆర్‌ నిర్ణయం తెరాసకు మేలు చేస్తుందా లేక నష్టపరుస్తుందా?అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు. వీటికి రానున్న రోజులలో సమాధానాలు లభించవచ్చు.


Related Post