అమిత్ షాతో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణన్ భేటీ!

October 07, 2019


img

రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాలు ఉంటాయని అందరికీ తెలుసు. అదేవిధంగా గత 2-3 దశాబ్ధాల నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అధికార, ప్రతిపక్ష మీడియాలుగా విడిపోయి తదనుగుణంగానే వార్తలను, విశ్లేషణలను వండివడ్డిస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న మీడియా సంస్థలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఒకటని చెప్పవచ్చు. కనుక రెండు ప్రభుత్వాలు, అధికార పార్టీలు, వాటి అనుకూల మీడియా సంస్థలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై మండిపడుతుండటం కూడా సహజమే. ముఖ్యంగా ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కధనాలు ప్రసారం చేస్తుండటంతో కొన్ని చోట్ల ఆ ఛానల్‌ ప్రసారాలు నిలిపివేస్తోంది. దానిని నిరసిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జగన్ ప్రభుత్వంతో గట్టిగానే పోరాడుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆదివారం డిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అవడం ఆలోచింపజేసే విషయమే. 

సుమారు గంటన్నరసేపు వారిరువురూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ సమావేశంలో వారిరువురూ ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకురాలేదు కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చిన్న వార్త వచ్చింది. 

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మీడియా ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. కొన్నిసార్లు మీడియా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది కూడా. ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అటువంటి కీలకపాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో తెరాస, కాంగ్రెస్‌, వైసీపీ, టిడిపిలకు ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయశక్తిగా ఎదగాలనుకొంటున్న బిజెపికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సహాయ సహకారాలు అందించాలని వేమూరి రాధాకృష్ణను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరి ఉండవచ్చు. ఇది నిజమా కాదా...అనే విషయం రానున్న రోజులలో బిజెపి పట్ల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వైఖరిని బట్టి తెలుస్తుంది.


Related Post