ఆర్టీసీ కార్మికులు ఇక ఇంటికే: కేసీఆర్‌

October 07, 2019


img

ఆర్టీసీ సమ్మెపై సిఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఊహించినట్లే సిఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల పట్ల కటినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఆర్టీసీ తీవ్ర నష్టాలలో ఉన్నప్పటికీ కార్మికులకు సగటున నెలకు రూ. 50,000 జీతం చెల్లిస్తున్నామని, అయినా వారు ఇంకా జీతాలు పెంచాలంటూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంతూ గొంతెమ్మ కోర్కెలు కోరుతూ సమ్మె మొదలుపెట్టి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సిఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పండుగ సమయంలో సమ్మె చేస్తున్నందుకు ప్రజలు కూడా వారిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, కనుక ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్న ఆర్టీసీ కార్మికులతో కటినంగా వ్యవహరించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధులలో చేరిన సుమారు 1,200 మందిని తప్ప మిగిలిన వారందరినీ ఉద్యోగాలలోకి తీసుకోకూడదని నిర్ణయించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కనుక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది.  

ఆర్టీసీలో ఇకపై సగం అద్దె బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తద్వారా ఆర్టీసీ నష్టాలను తగ్గించుకోవచ్చునని సిఎం కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీని మళ్ళీ గాడినపెట్టేందుకు ఇటువంటి కటినమైన చర్యలు తీసుకోక తప్పదని సిఎం కేసీఆర్‌ అన్నారు. ఇకపై ఎన్నడూ ఆర్టీసీలో ఇటువంటి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడకుండా ఉండేవిధంగా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. రెండువారాలలోపూ ఆర్టీసీ సేవలు పూర్తిస్థాయిలో పునరుద్దరించేవిధంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.   



Related Post