ఉప ఎన్నికలపై సమ్మె ప్రభావం ఉంటుందా?

October 05, 2019


img

నేటి నుంచి టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె ప్రారంభించాయి. సమ్మె నివారణకు ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రయత్నించినప్పటికీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే వారి డిమాండును ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించడంతో సమ్మె ప్రారంభం అయ్యింది. సమ్మె చేస్తున్న కార్మికులు ఈరోజు సాయంత్రంలోగా విధులలో చేరకపోతే ఉద్యోగాలలో నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. “రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందిని అరెస్ట్ చేయిస్తుందో..ఎంతమందిని ఉద్యోగాలలో నుంచి తొలగిస్తుందో మేమూ చూస్తామని,” సవాలు విసిరి సమ్మె కొనసాగిస్తున్నాయి. 

ఈనెలలో వరుసగా దసరా, బతుకమ్మ, దీపావళి పండుగలున్నాయి. ఈనెల 21న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో ఈ పరిణామాలు మొదలయ్యాయి. కనుక ఈ సమ్మె ప్రభావం ఉప ఎన్నికలపై ఎంతో  కొంత పడకమానదు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలుకగా, తెరాస సర్కార్ కార్మికులను ఉద్యోగాలలో నుంచి పీకేస్తామని బెదిరిస్తోంది. ఒకవేళ ఎన్నికల నాటికి ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరం అయినా లేదా వారిపై ప్రభుత్వం ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకున్నా ప్రజలలో వారిపై సానుభూతి పెరుగవచ్చు. తత్ఫలితంగా ఉప ఎన్నికలలో తెరాస నష్టపోవచ్చు. కార్మికులకు మద్దతు పలికినందుకు కాంగ్రెస్‌, బిజెపిలకు ఎంతో కొంత లబ్ధి కలుగవచ్చు. కనుక ఉప ఎన్నికలపై ఆర్టీసీ సమ్మె ఎంతోకొంత ప్రభావం చూపడం ఖాయమని స్పష్టమవుతోంది. అయితే అది ఏ మేరకు ఉంటుందనేది రానున్న రోజులలో జరుగబోయే పరిణామాలను బట్టి ఉంటుంది.


Related Post