ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌, బిజెపి మద్దతు

October 05, 2019


img



నేటి నుంచి ప్రారంభం అయిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సంఘీభావం తెలిపాయి. బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వ విధానాలవల్లే ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోతోంది. కానీ కార్మికుల వలన నష్టపోతోందని రవాణామంత్రి అజయ్ కుమార్ అనడం చాలా విచారకరం. ఏనాడూ తెలంగాణ ఉద్యమాలలో పాల్గొనని ఆయనకు ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటాలు, త్యాగాల గురించి ఏమి తెలుసు? అటువంటి వ్యక్తి కార్మికులను ఉద్దేశ్యించి సమ్మె చేస్తే ఉద్యోగాలలో నుంచి పీకేస్తామని చెప్పడం సిగ్గుచేటు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నించడం సరికాదు. ఇకనైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో మళ్ళీ చర్చలు ప్రారంభించి వారి సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని మేము కోరుతున్నాము. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మా పార్టీ సంఘీభావం తెలుపుతోంది,” అని అన్నారు. 

 కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులను మద్దతు కోసం కేసీఆర్‌ అనేకానేక హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టాక అవన్నీ మరిచిపోయారు. ? ఏదోవిధంగా ఆర్టీసీని మూసివేయాలనే సిఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. అందుకే సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగాలలో నుంచి పీకేస్తామని బెదిరిస్తున్నారు. సమ్మె మొదలవడానికి కారణం సిఎం కేసీఆరే తప్ప కార్మికులు కాదు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని గతంలో సమైక్య రాష్ట్ర పాలకులను హెచ్చరించిన కేసీఆర్‌ ఇప్పుడు అదే చేస్తున్నారు. కనుక దానికి ఆయన మూల్యం చెల్లించక తప్పదు,” అని అన్నారు. 

సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ ఆలీ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమాలలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారు. ఆనాడు వారు ఉద్యమాలలో పాల్గొనకపోయుంటే తెలంగాణ ఏర్పడి ఉండేదా? కేసీఆర్‌ అప్పుడు ఒకలాగా ఇప్పుడు అధికారం చేతికి వచ్చేక మరొకలాగ మాట్లాడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి తెరాస సర్కార్‌ ఎందుకు వెనకాడుతోంది?” అని ప్రశ్నించారు. 


Related Post