తెలంగాణ బిజెపికి మళ్ళీ తలనొప్పులు షురూ

October 04, 2019


img

లోక్‌సభ ఎన్నికల తరువాత తెరాస పట్ల బిజెపి అధిష్టానం వైఖరిలో మార్పు రావడంతో రాష్ట్ర బిజెపి నేతలు చాలా సంతోషించారు. డిల్లీలో పెద్దలు తెరాస సర్కార్‌ను, ముఖ్యంగా సిఎం కేసీఆర్‌ను దూరంగా పెడితే చాలు...రాష్ట్రంలో తాము మళ్ళీ అల్లుకుపోయి బలం పుంజుకోగలమని రాష్ట్ర బిజెపి నేతలు భావించారు. కానీ సరిగ్గా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలకు ముందు సిఎం కేసీఆర్‌ డిల్లీ వెళ్ళి ఈరోజు కేంద్రహోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీలతో వరుసగా భేటీ అవడంతో రాష్ట్ర బిజెపి నేతలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. 

తెరాస-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందని, రాష్ట్రంలో తెరాసకు బిజెపి బీ-టీం అని, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్ధిని గెలిపించేందుకు ఆ రెండు పార్టీలు తెర వెనుక చేతులు కలిపాయని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 

నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది కనుకనే కేంద్రంతో కోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, సిఎం కేసీఆర్‌ ఇప్పుడు నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించడానికి సిద్దపడుతున్నారని కె.లక్ష్మణ్‌ విమర్శించారు. నదుల అనుసంధానం పేరుతో లక్షల కోట్ల ప్రాజెక్టు మొదలుపెట్టి కేసీఆర్‌, జగన్ ఇద్దరూ భారీగా కమీషన్లు దండుకోవాలని ఆలోచిస్తున్నారని కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. 

ఒకపక్క సిఎం కేసీఆర్‌పై కె.లక్ష్మణ్‌ ఇటువంటి విమర్శలు చేస్తుంటే, సిఎం కేసీఆర్‌ అదే ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయమని ప్రధాని నరేంద్రమోడీని కోరుతుండటం విశేషం. దానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుందా లేదా? అనేది తరువాత విషయం. కానీ సరిగ్గా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇద్దరూ సిఎం కేసీఆర్‌కు అపాయింట్ ఇవ్వడం, రాష్ట్ర బిజెపి నేతలు వ్యతిరేకిస్తున్న కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం గురించి ఆయన చెప్పింది వారు ఓపికగా వినడంతో రాష్ట్ర బిజెపి నేతలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి హోదాలో సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని కలవడం తప్పు కాదని కె.లక్ష్మణ్‌ సమర్ధించుకోవలసి వచ్చింది. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, ఈ కొత్త ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుందని బహుశః సిఎం కేసీఆర్‌ కూడా ఆశించకపోవచ్చు. కానీ ఉప ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలను కలిసిరావడం ద్వారా తెరాస-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్‌ వాదనలకు బలం చేకూర్చగలిగారు. రేపు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు దీనిని తప్పకుండా లేవనెత్తుతారు. దానివలన తెరాసకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ ఇప్పుడిప్పుడే తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుదామని కలలు కంటున్న బిజెపి విశ్వసనీయత మళ్ళీ ప్రశ్నార్ధకంగా మారుతుంది. 

సిఎం కేసీఆర్‌ రేపు హైదరాబాద్‌ తిరిగి వచ్చిన తరువాత రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోడీ సరిగా స్పందించలేదని, రాష్ట్రానికి కేంద్రం చిల్లిగవ్వ విదిలించడానికి ఇష్టపడటం లేదని చెప్పడం ఖాయం. తెరాస నేతలు అదే ముక్క పట్టుకొని అల్లుకుపోయి బిజెపి వలన రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండబోదని ప్రచారం చేయడం ఖాయం.

ఒకపక్క తెరాస-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే అనుమానాలు రేకెత్తిస్తూనే, కేంద్రప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో బిజెపిని రాజకీయంగా దెబ్బతీయడం చాలా విచిత్రమైన రాజకీయ పరిణామమే.

కనుక ఇప్పటి వరకు రాష్ట్రంలో మేమే తెరాసకు ప్రత్యామ్నాయమని గొప్పలు చెప్పుకున్న రాష్ట్ర బిజెపి నేతలు, తెరాసతో తమకు ఎటువంటి అవగాహన లేదని హుజూర్‌నగర్‌ ప్రజలకు నచ్చజెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడవచ్చు. సిఎం కేసీఆర్‌ ఒకే ఒక డిల్లీ పర్యటనతో రాష్ట్ర బిజెపి నేతల గాలి తీసేశారని చెప్పవచ్చు. మరి రాష్ట్ర బిజెపి నేతలు ఇప్పుడు తెరాసను ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.


Related Post