ఆర్టీసీతో యుద్ధానికి ప్రభుత్వం సై!

October 04, 2019


img

ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులకు, త్రిసభ్య కమిటీకి మద్య ఈరోజు జరిగిన చర్చలు కూడా విఫలం అవడంతో ఇరు వర్గాలు తమ వైఖరిని ప్రకటించాయి. ముందుగా మీడియాతో మాట్లాడిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి చర్చలు విఫలమైనందున నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె చేయబోతున్నట్లు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన త్రిసభ్యకమిటీ ఛైర్మన్ సోమేష్ కుమార్, “తెలంగాణకు అతిముఖ్యమైన దసరా పండుగ సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేయాలనుకోవడం దురదృష్టకరం. వారితో మాట్లాడి సమ్మె నివారించేందుకు చాలా ప్రయత్నించాము కానీ వారు పట్టినపట్టు వీడకపోవడంతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చేసేందుకు మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రైవేట్ బస్సులను, అవసరమైతే స్కూలు బస్సులను పోలీసుల రక్షణలో నడిపిస్తాము. ఎవరైనా వాటిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకొంటాము. కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె చట్ట విరుద్దం. కనుక వారు సమ్మెకు దిగితే ఉద్యోగాలలో నుంచి తొలగించవలసి వస్తుంది. వారి స్థానంలో కొత్త ఉద్యోగులను నియమించడానికి ప్రభుత్వం వెనుకాడదు. 

టిఎస్ ఆర్టీసీని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది కనుకనే గత 5 ఏళ్ళలో రూ.3,303 కోట్లు ఆర్ధికసాయం అందజేసింది. ఆర్టీసీ సమస్యలపై అధ్యయనం చేసి, వాటిని శాస్వితంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. కానీ కార్మిక సంఘాలు చట్టవిరుద్దంగా సమ్మెకు సిద్దం అవుతున్నాయి. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తేగళమనుకోవడం సరికాదు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయగలదు. కనుక ఇకనైనా ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె ఆలోచన విరమించుకొని ఆర్టీసీని కాపాడుకునేందుకు ప్రభుత్వంతో కలిసిరావాలని కోరుతున్నాము,” అని అన్నారు. 

దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల, ప్రభుత్వ వైఖరి స్పష్టమైపోయింది. ఇరువర్గాలు యుద్ధానికే సిద్దపడుతున్నాయి. ప్రభుత్వోద్యోగుల పట్ల ఎప్పుడూ సానుకూలంగా వ్యవహరించే సిఎం కేసీఆర్‌, ఆర్టీసీ కార్మిక సంఘాల పట్ల, ఉస్మానియా విద్యార్ధుల పట్ల మొదటినుంచి ఎందుకో కటినంగానే వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల చర్చల తరువాత చివరికి మళ్ళీ అదే కటినవైఖరి ప్రదర్శిస్తుండటమే అందుకు తాజా ఉదాహరణ. ఈ సమ్మె వలన ఆర్టీసీ మరింత నష్టాలలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. 

ఇరువర్గాలు ఆర్టీసీని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నామని చెప్పుకొంటున్నందున ఆర్టీసీకి ఇంకా నష్టం కలుగకూడదనుకుంటే, ఇరు వర్గాలు పట్టువిడుపులు ప్రదర్శించి రాజీపడితే బాగుండేది. కానీ ఇరువర్గాలు మెట్టు దిగేందుకు సిద్దంగా లేకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. కనుక సమ్మె... ఆర్టీసీకి ఇంకా నష్టం రెండూ అనివార్యమయ్యాయి. బహుశః ఎప్పటిలాగే వారం పది రోజుల సమ్మె తరువాత ఇరువర్గాలు మెట్టు దిగి రాజీపడవచ్చు. కానీ అప్పటికే జరుగకూడని నష్టం జరిగిపోతుంది. మళ్ళీ దానిని ప్రభుత్వమే భర్తీ చేయవలసి ఉంటుంది. ఆ భారాన్ని ప్రజలు మోయవలసి ఉంటుంది.


Related Post