టిఎస్ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి కమిటీ

October 02, 2019


img

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో  గురువారం అర్దరాత్రి నుంచి ప్రారంభం కాబోతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి కూడా చర్చించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్, ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికోసం సీనియర్ ఐఏఎస్ అధికారులు సునీల్ శర్మ, సోమేష్ కుమార్, రామకృష్ణారావులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారు నేటి నుంచే ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభిస్తారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రజలు తమ సొంత ఊళ్ళకు బయలుదేరుతుంటారు కనుక సమ్మె ఆలోచనను విరమించుకోవాలని మంత్రివర్గం కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేసింది. 

ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్ తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకొని తమను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని. కానీ ఈ డిమాండ్‌పై మంత్రివర్గ సమావేశంలో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయనే విషయం తెలియదు. కనుక ఆర్టీసీ కార్మికులు కోరుకొంటున్నట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందా?కనీసం దశలవారీగా విలీనం చేయాలనే ఆలోచనైనా చేస్తోందా లేదా? అనేది తెలిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాకపోవచ్చు. 

త్రిసభ్య కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయగలదు. సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక తయారుచేసి ఇవ్వగలదు కానీ అంతిమ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వమే తీసుకోవలసి ఉంటుంది. చర్చలు, అధ్యయనం, నివేదిక తయారీలకు కనీసం రెండు మూడు వారాలు పట్టవచ్చు. కనుక ఈ త్రిసభ్యకమిటీ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయించడానికే ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఆర్టీసీ సమస్యలను ఎప్పటికైనా శాస్వితంగా పరిష్కరించాలనుకుంటే, సమస్యలను గుర్తించి పరిష్కారాలు చూపడానికి కమిటీ ఏర్పాటు కూడా చాలా అవసరమే. ప్రభుత్వమూ, ఆర్టీసీ కార్మికులు పరస్పరం నిలకడగా, నమ్మకంగా వ్యవహరించగలిగితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి లేకుంటే ప్రతీ ఏడాది ఇటువంటి పరిస్థితులే పునరావృతం అవుతుంటాయి. 


Related Post